‘పది’ సర్టిఫికెట్ పోయిందా?
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:18 PM
మీ పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) ఒరిజినల్ సర్టిఫికెట్‌ను పొరపాటున పోగొట్టుకున్నారా?
-ఆందోళన వద్దు
- డీజీఈకి దరఖాస్తు చేసుకోండి
- డూప్లికేట్ సర్టిఫికెట్‌ను పొందండి
గరుగుబిల్లి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మీ పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) ఒరిజినల్ సర్టిఫికెట్‌ను పొరపాటున పోగొట్టుకున్నారా? లేదా పాడైపోయిందా? అటువంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) డూప్లికేట్ సర్టిఫికెట్‌ను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇలా పొందాలి..
-విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఈన్ ద్వారా దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-ఈ దరఖాస్తులో విద్యార్థి వివరాలను నింపాలి. దానిపై హెడ్ మాస్టర్ సంతకాలు ఉండాలి.
-రూ.250 రుసుంను సీఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా ఈఎస్‌ఈవో3 - గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ల్‌మెంట్ సర్వీస్ కింద చెల్లించాలి. ఈ చలానాను ప్రింట్ తీసుకోవాలి.
-రూ.50 స్టాంప్ పేపర్‌పై నోటరీ లేదా జూనియర్ సివిల్ జడ్జి అటెస్టేషన్ చేయించాలి.
-ఒరిజినల్ సర్టిఫికెట్ పోయిందని, అది దొరకలేదని సబ్‌ఇన్‌స్పెక్టర్ లేదా అంతకంటే పైస్థాయి అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరిగి సర్టిఫికెట్ కాలిపోతే సంబంధిత అధికారుల నుంచి, భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులతో సర్టిఫికెట్ పోతే తహసీల్దార్ నుంచి అవసరమైన సర్టిఫికెట్‌ను తీసుకోవాలి.
- మీరు చదివిన పాఠశాల హెడ్ మాస్టర్ నుంచి అధికారిక లేఖ. ఈ లేఖపై తప్పనిసరిగా సంతకం, స్కూల్ స్టాంపు ఉండాలి.
- మీ పాత ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ అందుబాటులో ఉంటే దానిని జత చేయాలి.
- ఇలా సిద్ధం చేసుకున్న అన్ని పత్రాలను మీ పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా అమరావతిలోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (డీజీఈ) కార్యాలయానికి పంపాలి.
కార్యాలయ చిరునామా
డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, గరుడ వేగ టవర్స్ (ఎన్‌హెచ్-16 సర్వీస్ రోడ్డు), లక్ష్మీ నరసింహ కాలనీ, మంగళగిరి, అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, 522203.
గమనించవలసినవి..
సర్టిఫికెట్ ప్రాసెసింగ్ సమయం గరిష్టంగా వారం రోజులు ఉంటుంది. డూప్లికేట్ సర్టిఫికెట్ నేరుగా విద్యార్థికి పంపబడదు. ఇది కేవలం సంబంధిత పాఠశాల ప్రధానోపాధాయుల చిరునామాకు మాత్రమే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందుతుంది. విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లి సర్టిఫికెట్‌ను స్వీకరించాలి. విద్యార్థి తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
11111111111111111111111