Is the school bus safe? స్కూల్ బస్సు భద్రమేనా?
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:28 PM
Is the school bus safe? పాఠశాల బస్సులకు సంబంధించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కారణాలు పరిశీలిస్తే అనేక లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి.
స్కూల్ బస్సు భద్రమేనా?
తరచూ ప్రమాదాలు
రెండు రోజుల కిందట బొబ్బిలిలో ఘటన
వాహన సామర్థ్యం, డ్రైవర్ల ఎంపికపై అనుమానాలు
పైపై మెరుగులు దిద్దుతున్న యాజమాన్యాలు
- ఈ నెల 12న బొబ్బిలి మండలం అలజంగి సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయే క్రమంలో పొలాల్లోకి మళ్లింది. ప్రమాదంలో 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమీపంలో ఉన్నవారు స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
- గత ఏడాది జూన్ 17న డెంకాడ సమీపంలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన ఐదు రోజులకే ఈ ఘటన జరిగింది. సమీపంలో ఉన్నవారు కాపాడి ఆస్పత్రికి తరలించారు.
స్కూల్ బస్సుల్లో పిల్లల ప్రయాణం భద్రమేనా? ఆపద సమయంలో ఆదుకునే పరికరాలు వాహనంలో అందుబాటులో ఉంటున్నాయా? డ్రైవర్ సమర్థుడేనా? ఈ ప్రశ్నలకు చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం కోసం బస్సులను నడుపుతున్నారని, ప్రవేశాలు పెంచుకునే ఎత్తుగడ తప్ప భద్రత అంతంతమాత్రమేనని చెబుతున్నారు. జిల్లాలో స్కూల్ బస్సుల ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో లోపాలూ బయటపడుతున్నాయి. కానీ వాటిని సవరించుకోవడం లేదు.
విజయనగరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి):
పాఠశాల బస్సులకు సంబంధించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కారణాలు పరిశీలిస్తే అనేక లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి. బస్సు ఫిట్‌నెస్ నుంచి భద్రతా పరమైన జాగ్రత్తల వరకూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మొక్కుబడి తనిఖీల ఫలితమేనని బాధితులు విమర్శిస్తున్నారు. జిల్లాలో అడపాదడపా స్కూల్ బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల కిందట బొబ్బిలిలో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లడం ఆందోళన కలిగించింది. ఆ సమయంలో ఎక్కువ మంది పిల్లలు బస్సులో ఉన్నారు. అదృష్టవశాత్తూ చిన్న గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే మే నెలలో స్కూల్‌బస్సుల ఫిట్నెస్‌ను పరీక్షిస్తారు. గతంలో మాన్యువల్‌గా చేసేవారు. పాత బస్సులకే మెరుగులు దిద్దినట్టు ఆరోపణలు వచ్చేవి. కాసులకు కక్కుర్తిపడి అధికారులు పాత బస్సులకు సైతం అనుమతులు, ఫిట్నెస్ ధ్రువీకరణ ఇచ్చినట్టు విమర్శలు వినిపించేవి. అందుకే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయినా సరే స్కూల్ బస్సుల నిర్వహణ గాడిలో పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
- జిల్లా వ్యాప్తంగా సుమారు 420 వరకు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఉండగా వాటి పరిధిలో 600 వరకూ బస్సులు, వ్యాన్‌లు వినియోగంలో ఉన్నాయి. వీటికి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తనిఖీ చేశారు. అయితే ఇవి తూతూమంత్రంగా ముగించారన్న విమర్శలున్నాయి. కొన్ని పాఠశాలలు అనధికారికంగా బస్సులు నడుపుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి సురక్షితమైన, కండీషన్‌లో ఉన్న బస్సులనే వినియోగించాలి. 15 ఏళ్లు దాటి ఫిట్‌నెస్ లేని బస్సులను అస్సలు వినియోగించకూడదు. కానీ కొన్ని పాఠశాలలు పాత బస్సులకు రంగులు వేసి నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి.
డ్రైవర్ల ఎంపిక కీలకం..
స్కూల్ బస్సు డ్రైవర్ ఎంపిక కీలకం. శిక్షణ పొందిన ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్లనే ఎంపిక చేయాలి. ముందుగా వారి నుంచి ఫిట్‌నెస్ పొందాలి. కంటిచూపు సక్రమంగా ఉండడంతో పాటు మూర్చ వంటి వ్యాధులు లేని వారిని ఎంపిక చేసుకోవాలి. అయితే నిష్ణాతులైన డ్రైవర్లకు అధిక వేతనం ఇవ్వాల్సి వస్తోందని కొన్ని యాజమాన్యాలు వయసు పైబడిన వారిని సైతం డ్రైవర్లుగా ఎంపిక చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బస్సు డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారిని కూడాబస్సు డ్రైవర్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ నిబంధనలు తప్పనిసరి..
స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్, బీమా తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేయాలి. బస్సు ముందు, వెనుక భాగాల్లో స్కూల్ బస్సు, ఆన్ స్కూల్ డ్యూటీ అని రాయాలి. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఎమెర్జెన్సీ డోర్ ఏర్పాటు చేయాలి. అగ్నిప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. కిటికీలకు నెట్ తప్పనిసరి. బస్సు తలుపులకు లాకింగ్ సిస్టమ్ ఏర్పాటుచేయాలి. బస్సులో పిల్లల కోసం సహాయకులను నియమించాలి. గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించకుండా స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటుచేయాలి. డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు నాలుగేళ్లు అనుభవం ఉండాలి. కానీ మెజార్టీ బస్సులకు ఇవేవీ అమలవుతున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
క్షుణ్ణంగా తనిఖీ చేశాం
జిల్లాలో ఏటా లాగే ప్రైవేటు స్కూల్ బస్సుల సామర్థ్య పరీక్షలు నిర్వహించాం. అప్పట్లో 600 బస్సులను తనిఖీ చేశాం. నిర్వహణ లోపం, కాలపరిమితి దాటిన బస్సులను తిరస్కరించాం. డ్రైవర్ల నియామకంతో పాటు బస్సుల నిర్వహణ విషయంలో యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం
- మణికుమార్, జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్, విజయనగరం