Share News

Is the patient safe? రోగికి భద్రత ఉందా?

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:25 PM

Is the patient safe? ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికీ సకాలంలో వైద్యం అందించడంతో పాటు.. బాధ నుంచి సాంత్వన చేకూర్చడం ముఖ్యం. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉందా అంటే లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది.

Is the patient safe? రోగికి భద్రత ఉందా?
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులతో కిటకిటలాడుతున్న ఓపీ కౌంటర్‌

రోగికి భద్రత ఉందా?

జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే దయనీయం

అత్యవసర వేళ స్ర్టెచర్‌ కోసం వెతుకులాట

ఓపీ, పరీక్షల కోసం గంటల నీరీక్షణ

నేడు ప్రపంచ రోగి భద్రత దినోత్సవం

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికీ సకాలంలో వైద్యం అందించడంతో పాటు.. బాధ నుంచి సాంత్వన చేకూర్చడం ముఖ్యం. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉందా అంటే లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని పరిస్థితులు రోగి భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఓపీ వద్ద భారీ రద్దీ.. అత్యవసర విభాగంలో స్ర్టెచర్‌లు, వీల్‌చైర్ల కోసం ఎదురుచూపులు.. ఎక్సరే.. స్కానింగ్‌ కోసం గంటల తరబడి నిరీక్షణ వంటి సమస్యలు.. రోగులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రపంచ రోగి భద్రత దినోత్సవం సందర్భంగా కీలక ఆసుపత్రిలోని పరిస్థితులపై ప్రత్యేక కథనం.

ఓపీ వద్ద గంటల నిరీక్షణ

జిల్లా ఆసుపత్రికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఓపీ కౌంటర్ల వద్ద రద్దీతో పొడవాటి క్యూలు కన్పిస్తుంటాయి. వృద్ధులు, అనారోగ ్యంతో వచ్చేవారు ఎక్కువ సేపు నిలబడలేక నేల మీద కూర్చుంటున్నారు. రోజుకు 1,400 పైగా ఓపీలు నమోదు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్‌ లేకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదని పలువురు చెబుతున్నారు.

వీల్‌చైర్ల కోసం వెతుకులాట

ప్రమాదాలలో గాయపడి వారు తీవ్ర అస్వస్థతతో వచ్చిన వారికి అత్యవసర సమయాల్లో వీల్‌ చైర్‌, స్రైచర్‌ అందుబాటులో వుండడం కీలకం. అయితే క్యాజువాలిటీ వద్ద కొన్ని సందర్భాల్లో వీటి కోసం బంధువులు ఎదురుచూడాల్సి వస్తుందని రోగుల సహాయకులు చెబుతున్నారు. అందుబాటులో వున్నవి తక్కువగా వుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. ఒక్కోసారి కుటుంబీకులే రోగులను పట్టుకుని వార్డులకు తీసుకువెళ్తున్నారు.

ఎక్సరే.. స్కానింగ్‌ వద్ద నిరీక్షణే

ఎక్సరే.. స్కానింగ్‌ విభాగాల వద్ద కూడా రోగులు ఎక్కువ సేపు వేచి వుండాల్సిందే. సాంకేతిక సిబ్బంది అందుబాటులోకి లేకపోవడం, కొన్ని పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో పరీక్షలు ఆలస్యమౌతున్నాయని రోగులు చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు, గంటల తరబడి ఆసుపత్రిలో వుండాల్సి రావడంతో ఆకలి, దాహంతో ఇబ్బందులు పడుతున్నారు.

మందుల కోసం క్యూ

వైద్యులు సూచించిన మందులను తీసుకునేందుకు కూడా రోగులు క్యూ కట్టాల్సిందే. తగినంత మంది ఫార్మాసిస్టులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 25 మంది ఫార్మాసిస్టులు అవసరం వుండగా, 13 మంది మాత్రమే అందుబాటులో వున్నారు. రోగుల తాకిడి తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

సమాచారం అడిగితే విసుక్కుంటున్నారు

నరేష్‌, రోగి బంధువు, విజయనగరం

మా అమ్మకి ఇచ్చిన టాబ్లెట్టు ఏమిటీ? దాని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వుంటాయా? అని డ్యూటీ నర్సుని అడిగితే విసుక్కున్నారు. రోగికి ఏ వైద్యం చేయిస్తున్నారో? తెలుసుకునే హక్కు లేదా? ఏం అడిగినా పట్టించుకోవడం లేదు. దీనివల్ల రోగులకు తీవ్ర నిరాశ కలుగుతోంది. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పోతోంది.

========

అసౌకర్యం కలగకుండా చర్యలు

డాక్టరు అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, విజయనగరం

రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఓపీ రద్దీని నియంత్రించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యవసర విభాగంలో స్ర్టెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో వుండేలా చూస్తున్నాం. రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. సందేహాలను వైద్యులను అడిగి తెలుసుకొనేందుకు రోగులు, బంధువులు సంకోచించకూడదు. వైద్యుల సూచనలు లేకుండా యాంటీ బయోటెక్స్‌ వాడకూడదు.

Updated Date - Sep 16 , 2026 | 11:25 PM