Is the Journey Safe? ప్రయాణం సురక్షితమేనా?
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:24 AM
Is the Journey Safe? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు కారణం. ఆదివారం తెల్లవారు జామున విశాఖపట్నం గాజువాక వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద సంఘటనతో ప్రయాణికులు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
మూడు డిపోల్లో పాత బస్సులే అధికం
అద్దె వాహనాలే దిక్కు..
కొత్త బస్సులు కొనుగోలు కాగితాలకే పరిమితం
ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నపం
పార్వతీపురం టౌన్/సాలూరు/పాలకొండ, జూన్1(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు కారణం. ఆదివారం తెల్లవారు జామున విశాఖపట్నం గాజువాక వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద సంఘటనతో ప్రయాణికులు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆగిఉన్న లారీని పార్వతీపురం డిపో బస్సు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. తొమ్మిది మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతుల్లో జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు. మరొక డ్రైవర్ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం అతి వేగమా? లేక నిద్ర మత్తా! అన్నది సంబంధిత అధికారులు విచారణలో తేల్చాల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండలో ఆర్టీసీ డిపోలున్నాయి. వాటిల్లో అత్యధి కంగా కాలం చెల్లిన బస్సులే ఉన్నట్లు తెలుస్తోంది. అవి తరచూ మరమ్మతులకు గురువు తున్నాయి. మార్గమధ్యలో మొరాయిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడు డిపోల్లోనూ అద్దెబస్సులే ఎక్కువగా నడుస్తున్నాయి.
- పార్వతీపురం ఆర్టీసీ డిపోనకు 54 వరకూ సొంత బస్సులున్నాయి. అవి అవన్నీ కాలం చెల్లినవే. ఎప్పుడో 30 ఏళ్ల కిందట కొనుగోలు చేసి ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులనే నేటికీ నడిపిస్తున్నారు. ఈ డిపో పరిధిలో 34 అద్దెబస్సులు ఉన్నాయి. జిల్లాలోని పాలకొండ, సాలూరు, తదితర ప్రాం తాలకు వాటిని నడుపుతున్నారు. ఇక్కడి నుంచి విశాఖ, విజయనగరం, విజయ వాడ, రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాలకు కూడా సర్వీసులున్నాయి. మొత్తంగా పాత, అద్దె బస్సులు కలిపి 88 ఉండగా రోజుకు 35 వేల కిలో మీటర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
- సాలూరు ఆర్టీసీ డిపోలో 55 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 21 అద్దె బస్సులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే 5 ఎక్స్‌ప్రెస్ బస్సులు కొనుగోలు చేశారు. బస్సులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని డిపో డీఎం ఆచారి తెలిపారు.
- పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు 82 ఆర్టీసీ బస్సులను నడుపుతన్నారు. వీటిలో 18 అల్ర్టాడీలక్స్, ఏడు ఎక్స్ ప్రెస్ సర్వీసులున్నాయి. ఇంద్ర , సూపర్‌లగ్జరీ కూడా ఉంది. పల్లెవెలుగులు 55 వరకు ఉన్నాయి. వీటిలో హైర్ బస్సులు 22 ఉండగా, 60 ఆర్టీసీ సొంత బస్సులు ఉన్నాయి. కాలం చెల్లిన 12 ఆర్టీసీ బస్సులను ఏడాది కింట ఆర్టీసీ యాజమాన్యానికి అప్పగించారు. ఏడాదిన్నర కిందట నాలుగు కొత్త ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రభుత్వం మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో మెకానిక్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. డిపో పరిధిలో ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు గురై ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించిన సందర్భాల్లేవని ఆర్టీసీ డీఎం బీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
- ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు అనేది కాగితాలకే పరిమితమవుతోంది. గత పదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో పార్వతీపురం ఆర్టీసీ డిపోనకు కొత్త బస్సులేవీ రాలేదు. మొత్తంగా ప్రయాణికుల ప్రాణాలను గాలిలో దీపంలా మార్చారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి నూతన ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యం
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే మా లక్ష్యం. పాత, అద్దెబస్సుల నిర్వహణ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం, ఉన్నతా ఽధికారుల ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.
-లక్ష్మణరావు, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్