Is the helmet quality? హెల్మెట్ నాణ్యమైనదేనా?
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:47 PM
Is the helmet quality? హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపితే జరిమానా .. ఆపై కేసులు.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెచ్చరించడం ఒకెత్తయితే హెల్మెట్ నాణ్యత సరిచూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
హెల్మెట్ నాణ్యమైనదేనా?
నకిలీవి కొని మోసపోవద్దు అంటున్న అధికారులు
ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే కొనాలని సూచన
రాజాం రూరల్, జనవరి 22(ఆంధ్రజ్యోతి):
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపితే జరిమానా .. ఆపై కేసులు.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెచ్చరించడం ఒకెత్తయితే హెల్మెట్ నాణ్యత సరిచూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. హెల్మెట్ ఉండి కూడా తీవ్ర గాయాలైన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఈ పరిస్థితిలో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు నాణ్యతను పరిశీలించడం కీలకం. ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే కొనాలని పలువురు సూచిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారుడికి హెల్మెట్ తప్పనిసరి. కొన్ని ప్రధాన పట్టణాల్లో పోలీసులు మరో అడుగువేసి.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలని నిబంధన పెట్టి కఠినంగా అమలుచేస్తున్నారు. అయితే పోలీసులకు చిక్కిన ప్రతిసారీ జరిమానా చెల్లించేకంటే హెల్మెట్ కొంటే సరిపోతుందన్న ఆలోచన అందరిలో రావాలని పోలీస్, రవాణాశాఖ అధికారులు కోరుతున్నారు. అయితే ప్రధాన రహదారులపై ప్రయాణించేటప్పుడు ప్రతి జంక్షన్‌లోనూ హెల్మెట్‌ల అమ్మకాలు కనిపిస్తున్నాయి. రూ.500 చెప్పి చివరికి రూ.300కి.. ఇంకా కాదని బేరం ఆడితే రూ.250కి ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నాణ్యమైనదా, కాదా అని పరిశీలిస్తే.. అమ్మేవ్యక్తి ఐఎస్‌ఐ మార్క్ చూపిస్తున్నాడు.. దీంతో నిజమని నమ్మి కొంటే.. అంతే సంగతులు.. ఇదే తరహా హెల్మెట్‌లను షోరూంలలో రూ.1000, ఆపై ఎక్కువ ధరకు అమ్ముతున్నారు... ఇలాంటి పరిస్థితుల్లో ఏది నిజమైన ఐఎస్‌ఐ మార్క్ హెల్మెట్ అనేది తేల్చుకోలేక ద్విచక్ర వాహనదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఎలాంటి హెల్మెట్‌లు వాడాలంటే..
- భారతీయ ప్రమాణాల సంస్థ (బిఐఎస్) రూపొందించిన ఐఎస్ 4151- 2015 హెల్మెట్‌ను మాత్రమే ధరించాలి.
- ఇది సుమారు 1500 గ్రాముల బరువు ఉంటుంది.
- ఎక్కువ బరువున్న హెల్మెట్ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే.. మెడపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
- రోజువారీ వినియోగానికి ఫుల్‌ఫేస్, లోయర్ ఫేస్ కవర్ ఉన్నవి మాత్రమే వాడితే మంచిది.
- సరైన పరిమాణం, బిగువైన చిన్ స్ట్రాప్ ఉండేలా చూసుకోవాలి.
- అప్పటికే ప్రమాదానికి గురైన హెల్మెట్, లోపల పగుళ్లున్న పాత హెల్మెట్‌లను వాడకూడదు.
వీటితో మరింత రక్షణ
- ఫైబర్‌గ్లాస్, పాలీ కార్బొనేట్, కంపోజిట్ పదార్థాలతో చేసిన హెల్మెట్ అయితే బయటపొర మొదటిదెబ్బను స్వీకరించి పదునైన వస్తువుల్ని తలలోకి చొచ్చుకెళ్లకుండా అడ్డుకుంటుంది.
- బయటపొర తర్వాత ఉండే ఈపీఎస్ ప్రమాద సమయంలో మెదడుపై పడే దెబ్బ తీవ్రతను తగ్గిస్తుంది.
- ఈపీఎస్ మీద ఉండే మృధువైన పొరే కంఫర్ట్ ప్యాడింగ్.. తలపై హెల్మెట్ కదలకుండా ఉండేలా చూస్తుంది.
- గాలి, దుమ్ము, వర్షం, పురుగుల నుంచి కళ్లను విజర్ రక్షిస్తుంది.
- చిన్‌స్ట్రాప్ బిగువుగా లేకపోతే ఖరీదైన హెల్మెట్ కూడా పనికిరాదు.
- హెల్మెట్‌లో గాలి ప్రసరణ, లోపలివేడి, చెమటను తగ్గించే వెంటిలేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది.
ఆథరైజ్డ్ డీలర్ వద్దే కొనాలి
కె.అశోక్‌కుమార్, సీఐ, రాజాం టౌన్
నాణ్యతలేని హెల్మెట్ ధరిస్తే ప్రమాదం సంభవించే సమయంలో ప్రాణాలకు భద్రత ఉండదు. నాసిరకం హెల్మెట్ కొన్నా ఫలితం ఉండదు. కొంతమంది ఐఎస్‌ఐ మార్క్‌తో మోసగిస్తున్నారు. రోడ్డుపక్కన అమ్మేవారి వద్ద కొనడం కన్నా బిల్లు ఇచ్చే ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కొనడం మేలు. అలాంటివాటిలో లోపలి నిర్మాణం సరిగ్గా ఉంటుంది. ప్రాణానికి భద్రత లభిస్తుంది.