Is the coast safe? తీరం భద్రమేనా?
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:54 PM
Is the coast safe?మన తీరం భద్రమేనా... పోలీస్ లేదా మెరైనా విభాగం నిఘా పూర్తిస్థాయిలో ఉందా.. ప్రమాద సమయాల్లో సకాలంలో మత్స్యకారుల ఆచూకీ లభిస్తోందా... ముఖ్యమైన తీర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా.. అన్ని బోట్లకూ ట్రాన్స్‌పాండర్లు అమర్చారా.. ఈ ప్రశ్నలకు లేదనే సమాధానాలే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి
తీరం భద్రమేనా?
జిల్లాలో 28 కి.మీల పొడవునా సముద్రం
చాలా పడవలకు కానరాని ట్రాన్స్ పాండర్లు
ప్రమాదాల సమయంలో లభ్యంకాని మత్స్యకారుల ఆచూకీ
బలహీనంగా మెరైన్ విభాగం
జాడలేని సీసీ కెమెరాలు
మన తీరం భద్రమేనా... పోలీస్ లేదా మెరైనా విభాగం నిఘా పూర్తిస్థాయిలో ఉందా.. ప్రమాద సమయాల్లో సకాలంలో మత్స్యకారుల ఆచూకీ లభిస్తోందా... ముఖ్యమైన తీర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా.. అన్ని బోట్లకూ ట్రాన్స్‌పాండర్లు అమర్చారా.. ఈ ప్రశ్నలకు లేదనే సమాధానాలే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. చేపల వేటకు వెళ్తూ మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మత్స్య సంపద యోజన కింద అన్ని పడవల్లో ట్రాన్స్‌పాండర్లు, వీలైనన్ని ప్రాంతాల్లో ఎర్త్‌స్టేషన్‌లు ఏర్పాటు చేస్తోంది. ఈ చర్య జిల్లా మత్స్యకారులకు, తీరానికి ఎంత భద్రత కల్పిస్తుందో చూడాలి.
విజయనగరం/ భోగాపురం, అక్టోబరు8(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 28 కిలోమీటర్ల సముద్ర తీరం పొడవునా భోగాపురం, పూసపాటిరేగ మండలాలు ఉన్నాయి. భోగాపురం మండలంలో ముక్కాం, చోడిపల్లిపేట, పెదకొండ్రాజుపాలెం, చిన కొండ్రాజు పాలెం, చేపలకంచేరు, ఎర్రముసలయ్యపాలెం, కొలవానిపాలెం ఉండగా పూసపాటిరేగ మండలంలో చింతపల్లి, నీలగెడ్డపేట, బర్రిపేట, పెద్దూరు, కొత్తూరు, పతివాడ, తమ్మయ్యపాలెం, బర్రిపేట, తిప్పల వలస, మద్దూరు, కొత్తూరు, కొనాడ, బొడ్డుగురవయ్యపేట, బొడ్డు వేంకటేషుపేట, కొల్లాయివలస, పులిగెడ్డ గ్రామాలున్నాయి. వీటిల్లో 20వేల మంది వరకు జనాభా ఉన్నారు. సుమారు 10వేల మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపలవేటే జీవనాధారంగా జీవిస్తున్నారు. ఈ రెండు మండలాల్లో మోటరైజ్డ్ పడవలు 712, నాన్ మోటరైజ్డ్ పడవలు 415 ఉన్నాయి. 16 ఫిష్ లాడింగ్ పాయింట్లు ఉన్నాయి. అయితే సువిశాలమైన బంగాళాఖాతం ఆనుకొని ఉన్న 28 కిలోమీటర్ల తీరం ఎటువంటి రక్షణకు నోచుకోవడంలేదు. ఏ ఆర్నెళ్లకోసారి మెరైన్, లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో సాగర్ కవచ్ కార్యకమ్రం నిర్వహించి సముద్ర మార్గంద్వారా వచ్చే తీవ్రవాదులను పట్టుకొనే మాక్‌డ్రిల్ నిర్వహిస్తుంటారు. ఆ తరువాత సముద్రంపై ఎటువంటి నిఘా ఉండడం లేదు. అనధికారిక వ్యక్తులు తీరంలో దిగితే గుర్తించేందుకు ఎటువంటి నిఘా వ్యవస్థ లేదు. రెండు మండలాలకు సంబంధించి పూసపాటిరేగ మండలం చింతపల్లిలో మాత్రమే మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది. సుమారు 60 మంది సిబ్బంది అవసరముండగా ప్రస్తుతం 28 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. శాటిలైట్ ట్రాన్స్‌పాండర్లు, జీపీఎస్ పరికరాలను అన్నిబోట్లకు అమర్చాల్సి ఉంది. అయితే జిల్లాలో శాటిలైట్ ట్రాన్స్‌పాండర్లకు 141 మంది మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నారని, ఆ మేరకు అమర్చామని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు లేదంటున్నారు. అటువంటి పరికరాలేవీ ఇవ్వలేదంటున్నారు.
ట్రాన్స్‌పాండర్లు ఉంటే..
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లక్ష ట్రాన్స్‌పాండర్లను అందించింది. మన రాష్ట్రానికి సంబంధించి 8 వేలకు పైగా మంజూరు చేసింది. ఈ యంత్రం ఉపగ్రహాలతో అనుసంధానమై పనిచేస్తుంది. జీపీఎస్ ద్వారా బోటు ఎక్కడ ఉంది? ఏ పరిస్థితుల్లో ఉంది? తదితర అత్యవసర పరిస్థితులకు సంబంధించి సమాచారం ఇస్తుంది. భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌ల నుంచి వచ్చే హెచ్చరికలు, సమాచారాన్ని సైతం స్వీకరిస్తుంది. సిగ్నల్ లేని ప్రాంతాల నుంచి కూడా సందేశాల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ పరికరాన్ని పడవలకు అమర్చడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మత్స్యకారులకు కూడా పూర్తిస్థాయిలో అవగాహన లేదు.
సీసీ కెమెరాల కోసం అధికారులకు చెప్పాం
భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలోని 28 కిలోమీటర్ల తీరంలో ఎటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. దీనిపై ఉన్నతాధికారులకు చెప్పాం. మెరెన్ పోలీస్‌స్టేషన్‌కు 60 మంది సిబ్బంది ఉండాలి. కానీ 28 మంది మాత్రమే ఉన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిరంతరం తీరంపై నిఘా పెడుతున్నాం.
వి.శ్రీనివాసురావు, మెరైన్ సీఐ, చింతపల్లి.
141 ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేశాం
భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతగ్రామాల్లో 712 మోటరైజ్డ్ పడవలు, 415 నాన్ మోటరైజ్డ్ పడవలు ఉన్నాయి. 141 మంది మత్స్యకారులు దరఖాస్తు చేసుకోగా వాటన్నింటికీ అమర్చాం. ఆ పడవలు 12 నాటికల్ మైళ్ల దూరం దాటినా కూడా ఎక్కడున్నాయో తెలుస్తుంది. మా కంట్రోల్ రూంకు సిగ్నల్స్ అందుతాయి. మత్స్యకారులకు ఎటువంటి లైఫ్‌జాకెట్లు మంజూరు కాలేదు.
- ఎం.లావణ్య, మత్స్యశాఖ డీడీ, విజయనగరం.