Share News

సెన్సార్‌ ఇక అంతేనా?

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:27 AM

డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సెన్సార్‌ వ్యవస్థ జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో పని చేయడం లేదు.

సెన్సార్‌ ఇక అంతేనా?
ఉపయోగంలో లేని సెన్సార్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌

- డ్రైవింగ్‌ ట్రాక్‌లో కాలిపోయిన సీసీ కెమెరాలు

- కొత్తవి ఏర్పాటు చేయని అధికారులు

- పాతపద్ధతిలోనే డ్రైవింగ్‌ టెస్టు ప్రక్రియ

- మళ్లీ మధ్యవర్తులదే హవా

విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సెన్సార్‌ వ్యవస్థ జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో పని చేయడం లేదు. సెన్సార్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కాలిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాటిని బాగు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సెన్సార్‌కు బదులు పాత పద్ధతిలోనే డ్రైవింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే మధ్యవర్తులు ప్రవేశించి తమ హవా సాగిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సెన్సార్‌ విధానం మంచి ఫలితాలను ఇస్తుందనే అభిప్రాయం ఉంది. అభ్యర్థుల డ్రైవింగ్‌ ట్రాక్‌ పరీక్షలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో డ్రైవింగ్‌ టెస్టు జరిగేలా కొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకువచ్చింది. అందుకుగాను ఆరు నెలల కిందట ఓ ప్రైవేటు సంస్థకు ఈ సెన్సార్‌ ప్రక్రియను అప్పగించింది. ప్రైవేటు సంస్థ, రవాణా శాఖాధికారుల సమన్వయంతో జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో డ్రైవింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చేశారు. సెన్సార్‌ వ్యవస్థ కోసం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఏర్పాటు చేశారు. నెలరోజుల కిందట సెన్సార్‌ వ్యవస్థతో డ్రైవింగ్‌ టెస్ట్‌ ప్రక్రియను ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే పిడుగులతో కూడిన వర్షం పడడంతో సెన్సార్లతో కూడిన సీసీ కెమెరాలు మొత్తం కాలిపోయాయి. మరమ్మతులకు గురైన సెన్సార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంగాని, లేదా పాడైన వాటిని మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తేవడంగాని సంబంధిత అధికారులు చేయలేదు. దీంతో వారం రోజుల పాటు డ్రైవింగ్‌ టెస్ట్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయాన్ని రవాణా శాఖాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాత విధానంతోనే డ్రైవింగ్‌ టెస్ట్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే మధ్యవర్తులు ప్రవేశించి తమ లాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యవర్త్తుల ప్రమేయంతో లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సెన్సార్‌ పద్ధతిలో లైసెన్స్‌లు మంజూరు చేసేటట్లు చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

1111111111111111111

Updated Date - Aug 21 , 2026 | 12:27 AM