Share News

ఆ రోడ్డు.. ఇంక అంతేనా?

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:38 AM

మక్కువ మండలం బాగుజోల నుంచి సిరివర రోడ్డుకు 2024 డిసెంబరులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ శంకుస్థాపన చే శారు.

ఆ రోడ్డు.. ఇంక అంతేనా?
కొట్టుకుపోయిన చిలకమండంగి నుంచి సిరివర వరకు నిర్మించిన రహదారి

  • ఏడాదిన్నర క్రితం డిప్యూటీ సీఎం శంకుస్థాపన

  • రెండు శాఖల పరిధిలో పనుల ప్రారంభం

  • ఇప్పటికీ పూర్తికాక గిరిజనుల ఇబ్బందులు

  • ఇటీవల వర్షానికి కొట్టుకుపోయిన పనులు

ఏజెన్సీ గ్రామాలకు పక్కా రహదారులు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరత, కాంట్రాక్టర్ల జాప్యంతో ఇది అటకెక్కింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రూ.9 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేసిన రోడ్డు పనులూ అంసంపూర్తిగానే మిగిలిపోయాయి. దీనికితోడు భారీ వర్షాలకు అరొకర పనులు కొట్టుకుని పోయాయి. తద్వారా నాణ్యతలోపాలు వెలుగు చూశాయి. అంతర్జాతీయ యుద్ధ ప్రభావంతో తారు ధర రెట్టింపు కావడం, పెండింగ్‌ బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు.

శంకుస్థాపనకే పరిమితమైన ఆశలు

కూటమి ప్రభ్వుం వచ్చాక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఆరు నెలల క్రితం డిసెంబరు 2024లో శంకుస్థాపన చేసినా భాగోజుల -సిరివర రహదారి పూర్తి కాకపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ శాఖల పనుల్లో మందగమనం

మొత్తం 8.55 కిలోమీటర్ల రోడ్డులో 2.5 కిలోమీటర్లు గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ శాఖకు, 6.05 కిలోమీటర్లు పంచాయతీరాజ్‌ శాఖకు కేటాయించారు. పనులు వేగంగా జరుగుతాయని భావించినా రెండు శాఖల పరిధిలోనూ పనులు మందగించాయి.

నిధులు బూడిద-నాణ్యతలోపం

పంచాయతీరాజ్‌ పరిధిలో చేసిన పనులకు రూ.2.86 కోట్ల బిల్లులు చెల్లించినప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మరియు వర్షాల తాకిడికి రోడ్డు ధ్వంసమై నిధులన్నీ నీళ్లపాలయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రెట్టింపై తారు ధరలతో పనులకు బ్రేక్‌

అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల కారణంగా తారు ధర టన్ను రూ.48వేల నుంచి రూ.96వేలకు పెరిగింది. పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

పార్వతీపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం బాగుజోల నుంచి సిరివర రోడ్డుకు 2024 డిసెంబరులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ శంకుస్థాపన చే శారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు అయ్యాయి. 2.5 కిలోమీటర్లు రహదారి గిరిజన ఇంజనీరింగ్‌శాఖ ద్వారా, 6.05 కిలోమీటర్లు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌శాఖ ద్వారా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాదిన్నర దాటినా ఈ రెండు శాఖలు రోడ్డు పనులు పూర్తి చేయలేక పోయాయి.

ఇలక మండంగి నుంచి సిరవర వరకు 6.05 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించి కొంతవరకు చేశారు. తర్వాత బీటీ పనులు వెంటనే ప్రారంభించకపోవడంతో.. వర్షాల వల్ల, నాణ్యతలోపం వల్ల కొంతమేర రోడ్డు దెబ్బతింది. చేసిన పనులకు 2..86 కోట్ల మేర బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. కానీ ఈ రోడ్డు దారుణంగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా తమకు రోడ్డు సౌకర్యంలేదని, ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడంతో చాలా సంతోషించామని, ఇప్పుడు రోడ్డు కొట్టుకుని పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిరివర తదితర గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి ఈ పనులను పరిశీలించారు. చేపట్టాలి తదుపరి చర్యల గురించి ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. కానీ ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.

బాగుజోల నుంచి చిలకమండంగి వరకు 2.5 కిలోమీటర్లు పనులు చేపట్టి కిలోమీటరు పొడవున సీసీ రహదారి నిర్మించారు. మిగిలిన 1.5 కిలోమీటర్లకు బీటీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. యుద్దం ప్రభావం వల్ల టన్ను తారు ధర రూ.48 వేల నుంచి రూ.96 వేలకు పెరిగిపోయింది. దీంతో బీటీ రహదారి పనులు పూర్తికావడం లేదు.

పనులు ప్రారంభిస్తాం

ప్రదీప్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి

సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరెడ్డి పనులను పరిశీలించారు. వర్షాల వల్ల చేసిన పనులు కొట్టుకుపోయాయి. దీనికి ప్రత్యామ్నయంగా చేపట్టాల్సిన పనుల కోసం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం.

నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తాం

మాశాఖ ద్వారా చేపట్టిన పనులు కిలోమీటరు పొడవునా పూర్తి చేశాం. మిగిలిన పనులు మరో నెలలో ప్రారంభిస్తాం. మా శాఖ పరిధిలో పూర్తి చేసిన పనులకు రూ.కోటి కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంది. వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తాం.

- డీవీఆర్‌ఎం రాజు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Updated Date - Aug 18 , 2026 | 12:38 AM