Share News

Is Quality నాణ్యత ఒట్టిమాటేనా?

ABN , Publish Date - May 16 , 2026 | 11:57 PM

Is Quality Just a Hollow Promise? జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండాల్సిన రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి.

Is Quality   నాణ్యత ఒట్టిమాటేనా?
చెలకమెండంగి నుంచి శిరివర వరకు బీటీ రోడ్డు ఇలా..

  • కొరవడిన పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షణ

  • ఇష్టారాజ్యంగా సాగుతున్న పనులు

  • మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్న వైనం

  • గిరిజనులకు తప్పని ఇబ్బందులు

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

పార్వతీపురం, మే16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండాల్సిన రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నిర్మించిన కొద్దిరోజులకే అధ్వానంగా మారడంతో గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. మొత్తంగా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడడం.. గిరిశిఖర గ్రామాల్లో అడిగే వారే లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారనే విమర్శలున్నాయి.

ఇదీ పరిస్థితి..

గిరిశిఖర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని.. డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రోడ్లు నిర్మిస్తోంది. అయితే పనుల నిర్వహణపై కొందరు అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పనుల నాణ్యతను పట్టించుకోవడం లేదు. దీంతో పనులు పూర్తికాకుండానే శిథిలమై వర్షాలకు రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. పలుచోట్ల ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు ఒక్కటైపో తుండడం కూడా ఈ పరిస్థితి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు.

- కొమరాడ మండలం గుణానపురం నుంచి సీతారాంపురం వరకు పీఎం గ్రామీణ సడక్‌ యోజన రహదారి కోసం రూ.56 లక్షలు మంజూరు చేశారు. ఈ బీటీ రోడ్డు పనులు ఇష్టారాజ్యంగా చేపట్టారు. రహదారాకి ఇరువైపులా బెర్ములు వేయలేదు. తారు కూడా తేలి మట్టి దర్శనమిస్తుండడంతో గిరిజన గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

- మక్కువ మండలంలో గిరిశిఖర ప్రాంతం చెలకమెండంగి నుంచి శిరివర వరకు ఆరు కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.9.25కోట్లు మంజూరయ్యాయి. గతేడాది ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు కనీసం 30శాతం పనులు కూడా పూర్తికాలేదు, పైగా చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపం కనిపిస్తోంది. అనతికాలంలోనే ఈ రోడ్డు పూర్తిగా పాడవడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన వర్షాలకు రోడ్లు కోతకు గురై కొట్టుకుపోయాయి. నాసిరకం మెటల్‌, జీఎస్పీ వాడటంతోపాటు ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- ఇక ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు పాచిపెంట మండలంలో ఆలూరు నుంచి మోదిగ వరకు గిరిశిఖర ప్రాంతంలో హడావుడిగా బీటీ రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో గిరిజనులు పెదవి విరుస్తున్నారు. పనులు ఇలానే చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సుమారు రూ.నాలుగు కోట్ల అంచనాతో ఈ ప్రాంతంలో రోడ్డుతో పాటు వంతెనతో పనులు చేపట్టారు. అయితే ఈ మార్గంలో గాదెలమడ - పెదమడల మధ్యలో ఉన్న మలుపు వద్ద తూతూమంత్రంగా పనులు చేపట్టారు. ప్రస్తుతం ఇది ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోదిగ పంచాయతీకి ఆరోగ్య కేంద్రం మంజూరు చేసింది. అయితే దీనికి బోరు అవసరమైనా.. ఏర్పాటు చేయలేక పోయారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో రిగ్గు వాహనం ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

పరిశీలిస్తాం..

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాల మేరకు రహదారుల పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు ఐదేళ్ల వరకు నిర్వహణ బాధ్యత ఉంది. ఎక్కడైనా నాణ్యతా లోపాలుంటే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

- శర్మ, ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Updated Date - May 16 , 2026 | 11:57 PM