Share News

ఖరీఫ్‌ గట్టెక్కేనా?

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:32 PM

ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకపక్క ప్రాజెక్టుల్లో కనీస స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం.. మరొపక్క ఇప్పటి వరకు వర్షాల జాడ లేకపోవడంతో రైతులు కలవర పడుతున్నారు.

ఖరీఫ్‌ గట్టెక్కేనా?
మడ్డువలస ప్రాజెక్టులో అడుగంటిన నీరు

- ప్రాజెక్టుల్లో తక్కువగా ఉన్న నీటి నిల్వలు

- వర్షం జాడలేకపోవడంతో రైతుల్లో బెంగ

- రబీలో నీరు అందక తగ్గిన పంటల సాగు

- ఇప్పుడు ఖరీఫ్‌లో అదే పరిస్థితి ఉంటుందని ఆందోళన

- వంగర మండలం కొప్పర కొత్తవలసకు చెందిన అమ్మన్నాయుడు అనే రైతు గతంలో పొలంలో మొక్కజొన్న సాగుచేసేవాడు. రబీలో భాగంగా మొక్కజొన్న వేసి ఉపాధి పొందేవాడు. కానీ గత రెండేళ్లలో సాగులో నష్టాలు ఎదురయ్యాయి. సకాలంలో సాగునీరు అందడం లేదు. ఆపై చీడపీడలు, తెగుళ్లు పెరిగాయి. దీంతో పంట సాగుచేసి నష్టాలపాలుకావడం కంటే..సాగు చేయకుండా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చాడు.

- రేగిడి మండలం శిర్లాం గ్రామానికి చెందిన అసిరినాయుడు తనకున్న పొలంలో చెరకు సాగుచేసేవాడు. ఖరీఫ్‌లో వరితో పాటు రబీలో చెరకు సాగుచేసి లాభాలు అర్జించేవాడు. కానీ క్రమేపీ చెరకు సాగుతో నష్టాలు ప్రారంభమయ్యాయి. సాగు పెట్టుబడులు పెరిగాయి. మద్దతు ధర కూడా తగ్గింది. దీంతో చెరకు సాగుచేయడం మానేశాడు.

- రాజాం నియోజకవర్గంలో మడ్డువలస రిజర్వాయర్‌ పరిధిలో రబీలో భాగంగా రైతులు విపరీతంగా ఆరుతడి పంటలు వేసేవారు. కాలువ పరిధిలోని వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో వేలాది ఎకరాల్లో పెసర, మినుము, వేరుశనగ వంటివి పండేవి. కానీ రిజర్వాయర్‌ నీరు కేవలం ఖరీఫ్‌కే పరిమితం అవుతోంది. సంక్రాంతి తరువాత చుక్కనీరు రాని దుస్థితి. గతంలో వేల ఎకరాల్లో పండిన పంటలు ఇప్పుడు వందల ఎకరాలకు పడిపోయాయి.

రాజాం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకపక్క ప్రాజెక్టుల్లో కనీస స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం.. మరొపక్క ఇప్పటి వరకు వర్షాల జాడ లేకపోవడంతో రైతులు కలవర పడుతున్నారు. రబీలో కూడా ప్రాజెక్టుల ద్వారా నీరందకపోవడంతో ఆరుతడి పంటల సాగు తగ్గింది. ఇదే పరిస్థితి ఖరీఫ్‌లో ఉంటే పరిస్థితి ఏంటని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్‌లో భాగంగా జిల్లాలో ఎక్కువగా వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న, వేరుశనగ, చెరకు, నువ్వు, పెసర, మినుము, ఉలవలు వంటి ఆరుతడి పంటలను సాగు చేస్తుంటారు. ప్రస్తుతం మడ్డువలస, నారాయణపురం, తోటపల్లి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది. కనీస స్థాయిలో నీటి నిల్వలు లేవు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రాజెక్టులు పనిచేస్తున్నాయన్న విమర్శ ఉంది. ప్రాజెక్టులు పూర్తిగా పాడవడంతో నీరు నిల్వ ఉండడం లేదు. మరోవైపు సంక్రాంతి తరువాత భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో మోటార్లకు సైతం నీరు అందని దుస్థితి. ఈ కారణాలతో రబీ సాగు ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. రబీ సాగు సాధారణ విస్తీర్ణం 65,809 హెక్టారులు. కానీ, ఈ ఏడాది 45,137 హెక్టార్లు సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇంత మొత్తంలో సాగు అన్నది అనుమానమే. కానీ అధికారులు మాత్రం ఫర్వాలేదని చెబుతున్నారు. జిల్లాలో వరి తరువాత ఎక్కువగా సాగుచేసే పంటల జాబితాలో మొక్కజొన్న, చెరకు, నువ్వు, వేరుశనగ ఉన్నాయి. అధికారులతో పాటు ప్రభుత్వం వరిపై చూపే శ్రద్ధ ఇతర పంటలపై చూపడం లేదన్న విమర్శ ఉంది. ఈ ఏడాది ఇంతవరకూ వర్షం జాడలేదు. జిల్లాలో నదులు, ప్రాజెక్టులు బేలా చూపులు చూస్తున్నాయి. కనీస స్థాయిలో కూడా నీటి నిల్వలు లేవు. దీంతో ఖరీఫ్‌పై రైతులు బెంగతో ఉన్నారు.

సాగునీటి కొరత కారణంగానే..

జిల్లాలో రబీలో సాగు విస్తీర్ణం తగ్గిన మాట వాస్తవమే. కానీ గత ఏడాదితో పోలిస్తే మాత్రం పెరిగింది. ప్రధానంగా సాగునీటి కొరత కారణంగానే రైతులు రబీలో పంటల సాగును తగ్గిస్తున్నారు. అందుకే ప్రభుత్వం సాగునీటి వనరులపై దృష్టిపెట్టింది. వ్యవసాయ శాఖపరంగా సలహాలు, సూచనలు అందిస్తున్నాం.

-వీటి రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, విజయనగరం

Updated Date - Jun 09 , 2026 | 11:32 PM