Is it the 'milking' of diseases? రోగాల ‘పాల’వ్వడమేనా?
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:55 PM
Is it the 'milking' of diseases? తెల్లగా మెరిసే పాలు నిజంగా పాలేనా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పాలలో సహజంగా ఉండే పోషకాలు.. ప్రొటీన్లు ఉంటున్నాయా అంటే వైద్యులు చెప్పలేమంటున్నారు. కారణం పాల ఉత్పత్తిని పెంచడానికి నిషేధిత ఆక్సిటోషిన్ ఇంజెక్షన్ వినియోగించడమే.
రోగాల ‘పాల’వ్వడమేనా?
కృత్రిమ పద్ధతులతో పాల ఉత్పత్తి పెంపు
ఆవులపై నిషేధిత ఆక్సిటోషిన్ ఇంజెక్షన్ ప్రయోగం
చిక్కదనం కోసం రసాయనాల మేళవింపు
ప్రాణాంతకమని హెచ్చరిస్తున్న వైద్యులు
తెల్లగా మెరిసే పాలు నిజంగా పాలేనా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పాలలో సహజంగా ఉండే పోషకాలు.. ప్రొటీన్లు ఉంటున్నాయా అంటే వైద్యులు చెప్పలేమంటున్నారు. కారణం పాల ఉత్పత్తిని పెంచడానికి నిషేధిత ఆక్సిటోషిన్ ఇంజెక్షన్ వినియోగించడమే. పాలల్లో చిక్కదనం, వెన్న శాతం అధికంగా కన్పించేలా ప్రమాదకర రసాయనాలు కూడా వాడుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో వెలుగుచూసిన కల్తీ పాల ఉదంతం కేవలం మచ్చుతునక మాత్రమే. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పాలను సహజంగా సేకరించడం తగ్గిపోతోంది.
విజయనగరం రింగురోడ్డు/గజపతినగరం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా పాలసేకరణ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఆవులు, గేదెల సంఖ్య నామమాత్రంగా ఉన్నా పాల సేకరణ కేంద్రాలు మాత్రం వందలాది లీటర్ల పాలను విక్రయిస్తుండడం గమనార్హం. లైసెన్సు విధానం లేకపోవడం వల్ల చిన్న వ్యాపారుల ముసుగులో కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. పాల కేంద్రాల్లోని యంత్రాలను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. తక్కువ పాలల్లోనూ చిక్కదనం, వెన్న శాతం అధికంగా కన్పించేలా ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. రైతుల వద్ద లీటరుకు రూ.30 నుంచి రూ.35 కొనుగోలు చేసే కేంద్రాలు ఆవు పాలను రూ.45, గేదె పాలను రూ.60 చొప్పున విక్రయిస్తూ భారీగా లాభపడుతున్నాయి. మరికొంత మంది వ్యాపారులు అధిక పాల దిగుబడి కోసం ’ ఆక్సిటోషన్’ ఇంజక్షన్లను పశువులకు ప్రయోగిస్తున్నారు. దీంతో అవి అధికంగా పాలు ఽఇస్తున్నాయి. కేంద్రం ఈ ముందును నిషేధించినా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెప్పించి వాడుతున్నారు.,
ఫ ఆక్సిటోషన్ ప్రభావం ఉన్న పాలను తాగడం వల్ల కేన్సర్ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గడమే కాకుండా 19 ఏళ్లు వచ్చినా బాలికలు రజస్వల కాని పరిస్థితి ఎదురౌతుందంటున్నారు. మహిళల్లో రుతుక్రమ సమస్యలు తలెత్తుతున్నాయని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రసాయనాలతో ‘సింథటిక్’ పాలు
కొంత మంది వ్యాపారులు ఆదాయార్జనే లక్ష్యంగా సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. చిక్కదనం కోసం యూరియా, అమ్మోనియా సల్ఫేట్, గంజిపొడి, పులుపు దాచేందుకు డిటర్జంట్లు, సబ్బులు, షాంపులు వినియోగిస్తున్నారు. నిల్వ ఉంచేందుకు హైడ్రోజన్ పేరాక్సైడ్, రంగుకోసం తెలుపు రంగులు వాడుతున్నారు.
కల్తీని ఇలా గుర్తించవచ్చు
పాలలో కొద్దిగా అయోడిన్ వేస్తే నీలం రంగులో మారినా, బాటిల్‌లో వేసిన ఊపినప్పుడు విపరీతంగా నురగ వచ్చినా అది కల్తీ అని గుర్తించాలి. అలాగే కొన్ని పాల చుక్కలను రెండు చేతులతో రుద్దేటప్పుడు మధ్యలో పిండి వస్తే కల్తీ అని గుర్తించాలి. పాలు కాచినప్పుడు అధికంగా నురగలాంటి ద్రవాలు వచ్చినా అందులో డిటర్జెంట్ కలిపినట్టు గుర్తించాలి. ఆహారఽభద్రతా ప్రమాణ చట్టం ప్రకారం కల్తీ పాలు అమ్మితే భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే అవకాశం వుంది. అయినా లాభార్జనే లక్ష్యంగా ప్రజలు ప్రాణాలతో వ్యాపారులు ఆటలు ఆడుకుంటున్నారు.
నిఘా పెంచాం
ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం
జిల్లాలో ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశాం. రాజమహేంద్రవరం ఘటన తరువాత శాంపిల్స్ సేకరణ రెట్టింపు చేశాం. పాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. కల్తీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు చౌకధరలు చూసి మోసపోకుండా నాణ్యత గల వస్తువులను కొనుగోలు చేయాలి. ఐఎస్‌ఐ, ఆగ్‌మార్క్ ముద్రణ ఉన్న వస్తువును కొనుగోలు చేయాలి. ఎక్కడైనా కల్తీ జరిగినట్టు గుర్తిస్తే ఫోన్ నంబరు 89194 79795కు ఫిర్యాదు చేయాలి.
క ల్తీతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
డాక్టరు పీఎస్‌వీ రామారావు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, విజయనగరం
కల్తీ ఆహారం తక్షణమే ప్రభావం చూపకపోయినా, అది నెమ్మదిగా శరీరంలోకి పేరుకుపోయి ప్రాణాంతకంగా మారుతుంది. యూరియా, డిటర్జెంట్, మెటనిల్ ఎల్లో ఇతర రసాయనాలు క్యాన్సర్ కారకాలు. వీటి వల్ల కిడ్నీ, లీవర్, గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. పెద్దవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆహారం కొనుగోలు చేసేటప్పుడు అవి కల్తీయా? కాదా? అన్నది గుర్తించి తీసుకోవాలి.