Share News

Is it mutating? మ్యుటేషన్‌ అవుతుందా?

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:30 AM

Is it mutating? గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన ఎల్‌.సింహాద్రిప్పడు దాదాపు నాలుగు నెలలు క్రితం మృతి చెందారు. ఈయన పేరున రెండు ఎకరాలు ఉన్నాయి. సింహాద్రిప్పడుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది.

Is it mutating? మ్యుటేషన్‌ అవుతుందా?

మ్యుటేషన్‌ అవుతుందా?

ముందడుగు పడని ఎఫ్‌ఎంసీ మ్యుటేషన్లు

రెవెన్యూ శాఖ నుంచి సబ్‌ రిజస్ట్రార్లకు అధికారం బదలాయింపు

విధివిధానాలపై స్పష్టత కరువు

మూడు నెలలుగా అవస్థలు పడుతున్న ప్రజలు

- గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన ఎల్‌.సింహాద్రిప్పడు దాదాపు నాలుగు నెలలు క్రితం మృతి చెందారు. ఈయన పేరున రెండు ఎకరాలు ఉన్నాయి. సింహాద్రిప్పడుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని మార్పు చేసుకోవడం కోసం కుమారుడు ప్రసాద్‌ రెవెన్యూ అధికారులను సంప్రదించారు. ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ ప్రకారం వారసత్వంగా మార్పు చేసే అధికారం తమకు లేదని సబ్‌ రిజస్ట్రార్లకు ప్రభుత్వం బదలాయించిందని చెప్పడంతో ఆయన సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం అధికారులను కలిశారు. రోజులుగా తిరుగుతున్నా పని కావడం లేదు.

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

ఎఫ్‌ఎంసీ మ్యుటేషన్లకు సంబంధించి విధి విధానాలు మారాయి. ఈ విషయం ప్రజలకు తెలియడం లేదు. అధికారులూ అవగాహన పర్చడం లేదు. చాలా మంది మ్యుటేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారూ స్పష్టత ఇవ్వడం లేదు. మ్యుటేషన్‌ చేయాల్సిన భూమికి సంబంధించి యజమాని లేకుంటే అతని మరణ ధ్రువపత్రం, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసి) ఉండాలంటున్నారు. అలాగే ఎఫ్‌ఎంసీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్తి పంపకం కింద దస్ర్తావేజులు తయారు చేయాలి. స్ట్టాంప్‌ డ్యూటీ కింద ఒక్కో ఫ్యామిలీ మెంబరు 1 శాతం చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కుమారుడు, కుమార్తె పేరున సమానంగా మార్పు చేయాలన్న నిబంధన కూడా ఉందని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఎఫ్‌ఎంసీ ద్వారా మ్యుటేషన్‌ ప్రక్రియకు ఏమాత్రమూ ముందడుగు పడడం లేదు. ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. వారసత్వంగా వచ్చిన భూమిని మార్పు చేసుకోవడానికి రైతులు, ఇతరులు మూడు నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌ఎంసీ ద్వారా భూమిని మార్పు చేసే అధికారం రెవెన్యూ అధికారుల నుంచి సబ్‌ రిజిస్ర్టార్లకు ప్రభుత్వం బదలాయించింది కానీ ప్రక్రియపై ప్రజలకు ముందుగా అవగాహన పర్చలేదు.

ఫ భర్త ఏదైనా కారణంతో మరణిస్తే ఆయన నుంచి వారసత్వంగా వచ్చిన భూములను భార్య పేరున మార్చాలంటే ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌(ఎఫ్‌ఎంసి) అవసరం. మీసేవలో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు పరిశీలించి గతంలో అతిసులువుగా మార్పు చేసేవారు. మూడు నెలల కిందట ఈ తరహా మ్యుటేషన్‌ విధానం రెవెన్యూ అధికారుల నుంచి సబ్‌ రిజిస్ర్టార్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ మ్యుటేషన్లు జరగడం లేదు. దీంతో రైతులు, ఇతరులు అవస్థలు పడుతున్నారు.

నేటికీ స్పష్టత కరువు

భూములను ఒకరు నుంచి మరొకరు పేరున మార్పు చేయాలంటే గతంలో రెండు మార్గాలు ఉండేవి. ఎవరైనా ఎక్కడైనా భూమిని కొనుగోలు చేసుకుంటే రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా రిజిస్ర్టేషన్‌ జరిగి అక్కడే ఆటోమ్యుటేషన్‌ అవుతుంది. రెండో విధానం ప్రకారం తల్లిదండ్రులు మరణిస్తే వారి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని పిల్లలు పేరున మార్చాలంటే మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ (ఎప్‌ఎంసి) ప్రకారం మార్పు జరిగేది. రెవెన్యూ అధికారులకు ఉన్న అధికారాన్ని సబ్‌ రిజస్ర్టార్లకు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంకా సబ్‌ రిజస్ర్టార్ల ద్వారా ఇటువంటి మ్యుటేషన్‌ ప్రక్రియ మొదలు కానట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దరఖాస్తు చేయడంపై స్పష్టత లేక రైతులు అయోమయంలో ఉన్నారు.

అక్కడే సమస్య

సాధారణంగా ఇంటి యజమాని మరణిస్తే వారసత్వంగా వచ్చే ఆ భూమిని నిబంధనల ప్రకారం భార్య పేరున మార్పు జరుగుతుంది. కొత్తగా ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎఫ్‌ఎంసీలో ఎంతమంది పేర్లు ఉంటే అందరి పేరున సమాన వాటా రాయాలంటున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. పెళ్లి సమయంలో ఆడ పిల్లలకు ఆస్తులు ఇచ్చామని, మళ్లీ ఇవ్వాలంటే ఎలా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యుటేషన్లు కాకపోవడంతో 1బిలు మంజూరు కావడం లేదు. ప్రస్తుత సీజన్‌లో ఖరీఫ్‌ రుణాల రెన్యూవల్‌ జరుగుతోంది. ఎఫ్‌ఎంసీ ద్వారా మ్యుటేషన్లు జరగకపోవడంతో 1బీలు రాక, రుణాలు రెన్యూవల్‌ చేసుకోలేక, పంటల బీమా చెల్లించుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఈ సమ్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

----------------

Updated Date - Aug 10 , 2026 | 12:30 AM