Share News

Government Land… So What? ప్రభుత్వ స్థలమా.. అయితే ఏంటంట?

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:14 AM

Is It Government Land… So What? జిల్లాకేంద్రంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కొంతమంది యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ‘ ఇది ప్రభుత్వ స్థలం’ అని బోర్డులు పెట్టినా.. ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. వాటిని పక్కన పడేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి.

  Government Land… So What? ప్రభుత్వ స్థలమా.. అయితే ఏంటంట?
వరహాలగెడ్డ స్థలంలో బోర్డు తొలగించిన దృశ్యం

  • మళ్లీ ఆక్రమణకు యత్నం

  • వరహాలగెడ్డ ప్రాంతానికి రక్షణ కరువు

పార్వతీపురం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కొంతమంది యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ‘ ఇది ప్రభుత్వ స్థలం’ అని బోర్డులు పెట్టినా.. ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. వాటిని పక్కన పడేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా పట్టణ నడిబొడ్డున సర్వే నెంబరు 410లో ఉన్న వరహాలగెడ్డ స్థలం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆ ప్రాంతంలో జిరాయితీ భూములున్న వారు గెడ్డ స్థలాన్ని కలిపేసుకుని ఇటీవల విశాఖకు చెందిన ఒక సంస్థకు విక్రయించారని ప్రచారం జరిగింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. వరహాల గెడ్డలో స్థలం చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ‘ ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు.’ అని అనే బోర్డు పెట్టారు. దీంతో వరహాలగెడ్డలో కొంత భాగాన్ని అయినా రెవెన్యూ అధికారులు రక్షించారని ప్రజలు భావించారు. కానీ గుర్తుతెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో అధికా రులు ఏర్పాటు చేసిన బోర్డు తీసివేసి.. పక్కనున్న తుప్పల్లో పడేశారు. అయితే ఇదంతా అక్రమార్కుల పనేనని.. వరహాల గెడ్డలో స్థలం ఆక్రమణకు మళ్లీ ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా వారి వెనుక బలమైన శక్తులున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ వైశాలిని వివరణ కోరగా.. ‘వరహాలగెడ్డ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించినట్టు సమాచారం లేదు. తిరిగి ఆ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేసి స్థలాన్ని రక్షిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 12:14 AM