Share News

Is It Delayed Every Year? ఏటా జాప్యమేనా?

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:55 PM

Is It Delayed Every Year? జిల్లాలోని కౌలు రైతులకు ఏటాలానే ఈ సారి కూడా సాగు హక్కు పత్రాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఒకవైపు జిల్లాలో ఖరీఫ్‌ పనులు ఊపందుకుంటున్నాయి. మరోవైపు విత్తనాల పంపిణీ కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధికారులు సాగు హక్కుపత్రాలు ఇంకా అందించకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Is It Delayed Every Year? ఏటా జాప్యమేనా?

  • ఆందోళనలో కౌలు రైతులు

  • వ్యవసాయాధికారుల తీరుపై విమర్శల వెల్లువ

పార్వతీపురం, జూన్‌13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కౌలు రైతులకు ఏటాలానే ఈ సారి కూడా సాగు హక్కు పత్రాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఒకవైపు జిల్లాలో ఖరీఫ్‌ పనులు ఊపందుకుంటున్నాయి. మరోవైపు విత్తనాల పంపిణీ కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధికారులు సాగు హక్కుపత్రాలు ఇంకా అందించకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే రాయితీ విత్తనాలతో పాటు ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రి పొందేందుకు ఈ పత్రం ఎంతో అవసరం. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోతే భూ యజమానితో పని లేకుండా పరిహారం పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు కూడా ఈ కార్డుల ద్వారా పొందొచ్చు. అయితే ఇంతటి కీలకమైన కార్డులు జారీలో ఏటా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా భూ యజమాని అనుమతి పేరిట కౌలు రైతులకు 11 నెలల కాలపరిమితితో రెవెన్యూశాఖ ద్వారా సాగు హక్కు పత్రాలు జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది 9,500 మందికి కౌలు కార్డులు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు మే చివరి వారం నుంచి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. పరిశీలన అనంతరం పంట సాగు హక్కుప త్రాలు జారీ చేయాల్సి ఉంది. కాని ఆ ప్రక్రియ వేగవంతం కావడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 105 మంది కౌలు రైతులకు మాత్రమే పత్రాలు ఇచ్చారు. పంట సాగు హక్కు పత్రాల జారీలో జాప్యం వల్ల కౌలు రైతులు రుణాల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనిపై డీఏవో భవానీశంకర్‌ను వివరణ కోరగా.. ‘కౌలు రైతుల కార్డులు రెన్యూవల్స్‌ పూర్తయిన వెంటనే కొత్త కార్డులు అందిస్తాం. జూలై నెలకు పూర్తిస్థాయిలో రెన్యూవల్స్‌ అవుతాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రతిఒక్క కౌలు రైతుకు కార్డులు అందిస్తాం. అర్హులందరికీ హక్కు పత్రాలు అందిస్తాం. ’ అని తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 11:56 PM