జూట్‌కు ప్రోత్సాహమేదీ?
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:09 AM
జిల్లాలో జూట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. గతంలో 16 జూట్ మిల్లులు ఉండగా, ఇప్పుడు కేవలం ఆరు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా అతి కష్టమ్మీద నడుస్తున్నాయి. మిగతావన్నీ మూతపడ్డాయి.
- జిల్లాలో మూతపడుతున్న మిల్లులు
- నిర్వహణ భారమే కారణం
- వీధినపడుతున్న కార్మికులు
రాజాం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. గతంలో 16 జూట్ మిల్లులు ఉండగా, ఇప్పుడు కేవలం ఆరు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా అతి కష్టమ్మీద నడుస్తున్నాయి. మిగతావన్నీ మూతపడ్డాయి. నిర్వహణ భారం ఎక్కువ కావడం, ప్రభుత్వాలు రాయితీలు కల్పించకపోవడం, ముడిసరుకు రాకపోవడం, గోగునార సాగు తగ్గడంతో పరిశ్రమలు ఒక్కొక్కటీగా మూతపడుతూ వస్తున్నాయి. ఫలితంగా వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న కార్మిక కుటుంబాలు వీధినపడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో గతంలో 16 వరకు జూట్ పరిశ్రమలు ఉండేవి. ప్రస్తుతం ఆరు మాత్రమే మిగిలాయి. రాజాంలోని సీతారామ, పోలిప్యాక్ జూట్ మిల్లులు, రేగిడి మండలం రెడ్డిపేటలోని ఎల్‌జీ, ఉంగరాడ మెట్ట వద్ద ఉన్న కేఎస్‌కే, తెర్లాం మండలం రంగప్పవలసలోని నవ్యాంధ్ర, బవిరిపురంలోని మోహిణి, లోలుగు సమీపంలోని మాధవి, కొత్తూరులోని మహాదేవ, రణస్థలంలోని నవ్యాంధ్ర, ఆమదాలవలసలోని వెంకటబాలాజీ జూట్ మిల్లులు పూర్తిగా మూతపడ్డాయి. ప్రస్తుతం సింగుపురం నీలం జూట్ మిల్లు, రాజాంలోని లక్ష్మి, కేశవ, ఎస్‌ఎస్‌ఎస్‌ఎల్, లక్ష్మీశ్రీనివాస్ మిల్లులతో పాటు నెల్లిమర్ల జూట్ మిల్లు మాత్రమే అతి కష్టమ్మీద నడుస్తున్నాయి. జూట్ పరిశ్రమలు మూతపడడంతో 20 వేల మంది వరకూ కార్మికులు వీధినపడ్డారు. కొందరు స్థానికంగా వేరే ఉపాధి మార్గాల వైపు వెళ్లారు. మరికొందరు ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వపరంగా రాయితీలు లేకపోవడం తదితర కారణాలతో జూట్ మిల్లులు మూతపడ్డాయి.
తగ్గిన విస్తీర్ణం..
జిల్లాలో గోగునార విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వ్యయప్రయాసలతో కూడిన సాగు కావడంతో రైతులు ఆసక్తిచూపడం లేదు. దీంతో పరిశ్రమల నిర్వహణకు పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బిహార్, బంగ్లాదేశ్ నుంచి గోగును తెస్తున్నారు. గతంలో స్థానిక రైతులు గోగును సాగుచేసి నారను ఉత్పత్తి చేసేవారు. పరిశ్రమల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే రైతులకు గోగుసాగు గిట్టుబాటు కావడం లేదు. విత్తనాలు సేకరించిన నాటి నుంచి గోగునారను ఊరవేయడం, నార తీయడం వంటి పనులు చాలా కష్టం. మద్దతు ధర ఉన్నా ఫలితం లేదు. క్వింటా గోగు రూ.13 వేలు వరకూ పలుకుతున్నా.. కష్టం ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు.
జాడలేని జూట్ కార్పొరేషన్..
రైతులు పండించిన గోగును కొనుగోలు చేయడానికి జూట్ కార్పొరేషన్ గతంలో ముందుకొచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో నియమించిన సిబ్బంది పదవీవిరమణ చేశారు. కొత్త వారి నియామకాలు జరగలేదు. దీంతో పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. తరువాత వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్లో అవగాహన, సాగు సలహాలు అందించేవారు. ఇప్పుడు అవి లేవు. దీంతో రైతులు పూర్తిగా సాగు తగ్గించేశారు. ప్రభుత్వం ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. జూట్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచిస్తోంది. అదే మంచిదని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇటువంటి సమయంలో జూట్ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తే మిల్లులు తెరుచుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రభుత్వాల విధానాలతో..
ప్రభుత్వాల విధానాలతో జూట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. వాటిని తెరిపించే ప్రయత్నం చేయడం లేదు. దీని ఫలితంగా వేలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారు. రాజాంలో సుమారు 7,500 మంది వరకు కార్మికులు ఉండేవారు. ఈఎస్‌ఐ సదుపాయం కల్పించమని పోరాటం చేస్తే గత టీడీపీ ప్రభుత్వం జిల్లాలో ఈఎస్‌ఐ ఫ్యామిలీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్పత్రిని పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పటికైనా రాయితీలు అందించాలి. మద్దతు ధర కల్పించాలి. అప్పుడే జూట్ మిల్లులు తెరుచుకుంటాయి.
- సీహెచ్ రామ్మూర్తినాయుడు, జూట్ కార్మిక యూనియాన్ గౌరవ అధ్యక్షుడు.