Share News

Engineering Education ఇంజనీరింగ్‌ విద్య అందేనా?

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:40 AM

Is Engineering Education Accessible? కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. పనులు పునఃప్రారంభానికి అడుగులు పడడం లేదు. దీంతో మన్యం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉన్నత విద్య కోసం పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

  Engineering Education   ఇంజనీరింగ్‌ విద్య అందేనా?
మధ్యలో నిలిచిపోయిన గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల భవన నిర్మాణం

  • సక్రమంగా బిల్లులు చెల్లించని గత వైసీపీ సర్కారు

  • ముందుకురాని కాంట్రాక్టర్లు

  • కూటమి ప్రభుత్వం స్పందించాలని విన్నపం

పార్వతీపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. పనులు పునఃప్రారంభానికి అడుగులు పడడం లేదు. దీంతో మన్యం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉన్నత విద్య కోసం పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. మరికొందరు ఇంటర్‌, డిగ్రీలతోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కురుపాం సమీపంలోని గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణం ప్రారంభించారు. అప్పట్లో సుమారు రూ.122 కోట్లు మంజూరు చేశారు. అయితే రూ.54 కోట్ల విలువైన పనులు చేపట్టగా.. గత ప్రభుత్వం రూ.45 కోట్ల వరకే బిల్లులు చెల్లించింది. ఇంకా రూ.9 కోట్ల వరకు బిల్లులను చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటివరకు 50 శాతం వరకే భవనం పనులవగా.. మిగతా 50 శాతం నిర్మాణం గత ఏడాదిన్నరగా సాగడం లేదు. మొత్తంగా గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సీఎం దృష్టికి తీసుకెళ్లినా..

గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు పునఃప్రారంభించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి కొద్దినెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. కళాశాల పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారుల బృందం కళాశాలను పరిశీలించింది. వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. అయితే ఇదంతా జరిగి సుమారు ఏడాది అవుతున్నా.. ఇంతవరకు కళాశాల ఇంజ నీరింగ్‌ పనులు పునఃప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై ఏపీఐడబ్ల్యూసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రామకృష్ణను వివరణ కోరగా.. ‘ఏడాదిన్నరగా గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు ఆగిపో యాయి. బకాయి బిల్లుల చెల్లింపుల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు పునఃప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 12:40 AM