Share News

Water Supply పనులు పూర్తికాక.. సాగునీరందక

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:11 AM

Irrigation Works Incomplete, Water Supply Disrupted వంశధర వరద నీటి మళ్లింపు కోసం చేపట్టిన పనులకు మోక్షం లభించడం లేదు. భామిని, పసుకుడి, లివిరి, బాలేరు, ఘనసర ప్రాంతాల్లో పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తే మండలంలో పది వేల ఎకరాలకు సాగునీరందనుంది.

  Water Supply  పనులు పూర్తికాక.. సాగునీరందక
బిల్లుమడ వద వరదకాలువ ఇలా..

  • వంశధార రిజర్వాయర్‌లోకి చేరని నీరు

  • దృష్టి సారించని గత వైసీపీ సర్కారు

  • ఏటా రైతులకు తప్పని అవస్థలు

  • కూటమి ప్రభుత్వంపై ఆశలు

భామిని, జనవరి14(ఆంధ్రజ్యోతి): వంశధర వరద నీటి మళ్లింపు కోసం చేపట్టిన పనులకు మోక్షం లభించడం లేదు. భామిని, పసుకుడి, లివిరి, బాలేరు, ఘనసర ప్రాంతాల్లో పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తే మండలంలో పది వేల ఎకరాలకు సాగునీరందనుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. దీంతో రైతులంతా కూటమి సర్కారుపై ఆశలు పెట్టు కున్నారు. సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ గేట్‌, పిల్ల కాలువ పనులు పూర్తి చేసి.. వచ్చే ఖరీఫ్‌కైనా సాగునీరు అందించాలని వారు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- భామిని మండలంలో 1962లో నేరడి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఒడిశా రాష్ట్ర సర్కారుతో చర్చలు జరిపింది. అయితే ఫలితం లేకపో యింది. ఒడిశా అభ్యంతరాలు తెలపడంతో నేరడి బ్యారేజీ నిర్మాణం కొలిక్కి రాలేదు. దీంతో దాని స్థానంలో వరద నీటి మళ్లింపు కోసం కాలువ నిర్మించాలని 2005లో ప్రతిపాదించారు. జలయజ్ఞంలో భాగంగా ఫేజ్‌-2, స్టేజ్‌-2 కింద రూ.వెయ్యి కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అనివార్య కారణాలతో నిర్మాణం పూర్తికావడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు మారడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, మరోవైపు ఆశించిన స్థాయిలో వంశధారకు వరదలు రాకపోవడం, దీనికితోడు వరద కాలువ ముఖ ద్వారం వద్ద ఇసుక మేటలు వేయడంతో నీరు మళ్లడం లేదు. ఈ కారణంగా భామిని మండలంలో పాటు శ్రీకాకుళం జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరండం లేదు. దీంతో ఏటా రైతన్నలు వరుణుడిపై ఆధారపడి పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం వరద కాలువ పనుల వ్యయం రూ.2,400 కోట్లకు పెరిగింది. గత ఆరేళ్లుగా పనులేవీ జరగడం లేదు. వరద కాలువలో వంశధార నీటి ప్రవాహం కలగానే మిగిలింది.

- వరదకాలువ నిర్మాణంలో భాగంగా భామిని మండలంలో కాట్రగడ నుంచి కొరమ వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకాలు చేపట్టారు. కొన్నిచోట్ల లైనింగ్‌, వంతెన పనులు చేపట్టారు. దీంతో పలు గెడ్డలు, వాగులు, చెరువులు, కాలువ గర్భంలో కలిసిపోయాయి. మరోవైపు నేరడి బ్యారేజీ నుంచి వంశధార రిజర్వాయర్‌కు నీరు మళ్లించడానికి పూర్తిస్థాయి పనులు కావడం లేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా రైతులకు సాగునీరు సరఫరా కావడం లేదు.

చర్యలు తీసుకుంటున్నాం

కాంట్రాక్టర్‌ పనులు చేయడం లేదని ప్రభుత్వానికి తెలియజేశాం. కాట్రగడ వరద కాలువ ముఖద్వారం వద్ద మేటలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాంట్రాక్టర్‌ మారిస్తే సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, కాలువ పనులు చేపడతాం. గతంలా మాదిరిగా వంశధారకు వరదలు రావడం లేదు. దీంతో నీటి మళ్లింపు ఇబ్బందిగా మారింది.

- రామచంద్రరావు, ఎస్‌ఈ, వంశధార ప్రాజెక్టు

Updated Date - Jan 15 , 2026 | 12:11 AM