Irrigation Water ఇక సాఫీగా సాగునీరు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:05 AM
Irrigation Water to Flow Smoothly Now పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా సాగునీటి సరఫరాకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రూ.73.55 కోట్లు మంజూరు చేసింది. దీనిపై రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఈ నెల 17న ఆదేశాలు జారీ చేశారు.
పైపులైన్ల ద్వారా నీటి సరఫరాకు త్వరలోనే పనులు ప్రారంభం
పార్వతీపురం, ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా సాగునీటి సరఫరాకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రూ.73.55 కోట్లు మంజూరు చేసింది. దీనిపై రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఈ నెల 17న ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో.. పాచిపెంటలో ఉన్న పెద్దగడ్డ రిజర్వాయర్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ పనులను చేపట్టనున్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సమస్య లేకుండా కెనాల్‌కు అనుసంధానంగా పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. మోడరనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్ కార్య క్రమంలో భాగంగా సాగునీటిని ఆదా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలు చేపడుతున్నారు. భూగర్భంలో ఐరెన్ పైపులు ఏర్పాటు చేసి.. తద్వారా పెద్దగెడ్డ నుంచి ఉమ్మడి జిల్లాలోని పాచిపెంట, రామభద్రపురం మండలాల్లో 7,500 ఎకరాలకు ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా నీరందించనున్నారు. ‘జిల్లాలో పెద్దగెడ్డ ప్రాజెక్టును ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో మొదటిసారిగా చేపడుతున్న ఈ ప్రక్రియ సాలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించడం శుభపరిణామం. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేవిధంగా అధికా రులు పనిచేయాలి.’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ‘పెద్దగెడ్డ రిజర్వాయర్ ద్వారా పైపులైన్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించేందుకు రూ.73.55 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.’ అని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ‘ పైప్‌లైన్ ద్వారా 7,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఈ మేరకు టెండర్లు పిలిచాం. రెండు మండలాల పరిధిలో ఉన్న ఆయకట్టు వ్యవసాయ భూములకు ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా సాగునీరు అందిస్తాం.’ అని ఎంసీఏడీడబ్ల్యుఎం ఇన్‌చార్జి డీఈఈ డి.సురేష్ చెప్పారు.