శివారు భూములకు సాగునీరు అందట్లే!
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:46 PM
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంకా సాగునీటి కొరత వేధిస్తోంది.
- అధ్వానంగా కాలువలు
- ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నీటి మళ్లింపు
- దిగువకు చేరని నీరు
- ఎండిపోతున్న ఎదలు
-వరి నాట్లు పడని వైనం
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంకా సాగునీటి కొరత వేధిస్తోంది. పిచ్చిమొక్కలు, పూడికలతో కాలువలు అధ్వానంగా ఉండడంతో శివారు భూములకు నీరు చేరడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రైతులు కాలువలపై అక్రమంగా పైపులు వేసి నీటిని మళ్లీస్తున్నారు. దీంతో శివారు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. మేఘాలు కమ్ముతున్నా చినుకు రాలడం లేదు. దీంతో వరి ఎదలు, నారు ఎండిపోతున్నాయి. ఎదలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
వెంగళరాయసాగర్ పరిధిలో..
మక్కువ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్(వీఆర్‌ఎస్) ప్రాజెక్టు పరిధిలో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీరందక శివారు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు నుంచి అధికారులు ఈ నెల 7న సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో గరిష్టంగా 161 మీటర్ల నీరు నిల్వ ఉండాలి. కానీ, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక ప్రస్తుతం 155 మీటర్ల దిగువ స్థాయికి నీటిమట్టం ఉంది. ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోవడంతో ప్రాజెక్టు సమీపంలోని శంబర, చెముడు, కవిరిపల్లి గ్రామాలకే నీరందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు కుడి ప్రధాన కాలువకు అడ్డుకట్టలు వేసి తమ పొలాలకు నీటిని మళ్లించి వరినాట్లు వేస్తున్నారు. దీంతో కుడి ప్రధాన కాలువ పరిధిలోని పిల్ల కాలువలకు నీరు చేరడం లేదు. దీనివల్ల శివారు గ్రామాలైన కాశీపట్నం, పాపాయ్యవలస, కొయ్యన్నపేట, వెంకటభైరిపురం, కంచెడువలస భూములకు నీరు అందడం లేదు. ఎడమ కాలువ పరిధిలో మార్కొండపుట్టి, గైశిల, సరాయివలస, కొండబుచ్చింపేట, బంగారువలస, కోన, గోపాలపురం గ్రామాలకు సైతం సాగునీరు సరఫరా కావడం లేదు. కుడి ప్రధాన కాలువ, బ్రాంచి కాలువల మధ్యలో కొంతమంది రైతులు అక్రమంగా పైపులు అమర్చి, గట్లకు గండికొట్టి పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. ముఖ్యంగా కుడి ప్రధాన కాలువ పరిధిలో చెముడు నుంచి మక్కువ వరకూ నాలుగు చోట్ల అక్రమంగా పైపులను అమర్చారు. అధికారులు చర్యలు తీసుకొని తమ పొలాలకు నీరు అందేలా చూడాలని శివారు గ్రామాల రైతులు కోరుతున్నారు.
జంఝావతి ప్రాజెక్టు పరిధిలో..
గరుగుబిల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని శివారు భూములకు సాగునీరందడం లేదు. వరి ఉబాలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో సాగునీరు రాకపోవడంతో దళాయివలస, గొల్లవానివలస, గొట్టివలస, గరుగుబిల్లి, శివరాంపురం, పెద్దూరు, ఉద్దవోలు, తదితర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, కొమరాడ, మక్కువ మండలాల పరిధిలో సుమారు 24,500 ఎకరాలకు పైగా సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే ఆధునికీకరణ పనులు నిర్వహించని కారణంగా 9 వేల ఎకరాలకే పరిమితమైంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తుండడంతో చెరువులు నిండడం లేదు. మరోపక్క జంఝావతి ప్రాజెక్టు ద్వారా నీరు అందకపోవడంతో నాట్లు పడని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జంఝావతి ద్వారా 4,500 ఎకరాలకే సాగునీరు సరఫరా అవుతుంది. వారాబందీ విధానంలో అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లిభద్ర పరిధిలోని ఎనిమిది కిలో మీటరు వరకు సాగునీరు తక్కువగా సరఫరా అవుతుంది. 21ఎల్ డిస్ట్రిబ్యూటరీ ద్వారా తక్కువగా సరఫరా అవుతుండటంతో దిగువ గ్రామాలకు అందని పరిస్థితి ఏర్పడింది. సాగునీటి పరిస్థితికి అనుగుణంగా పలు గ్రామాలకు చెందిన రైతులు వరి ఎదలను సాగు చేసుకుంటున్నారు. మరికొంతమంది వరి ఉబాలుకు సిద్ధమైనా నీరందని పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రాజెక్టు ఏఈ ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ.. ‘జంఝావతి రబ్బరు డ్యాం పరిధిలో సాగునీటి ప్రవాహానికి అనుగుణంగా రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తున్నాం. ఆధునికీకరణకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. వచ్చే ఖరీఫ్‌కు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.’ అని తెలిపారు.