Share News

Irreparable Tragedy తీరని విషాదం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:08 AM

Irreparable Tragedy విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో సీతానగరం మండలానికి చెందిన గొట్టాపు త్రినాథ్‌(50) మృతి చెందడం జిల్లావాసులు కలిచివేసింది. ప్రధా నంగా స్వగ్రామం గాదెలవలసలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Irreparable Tragedy  తీరని విషాదం
మృతుడు త్రినాఽథ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • గాదెలవలస, మేలాపువలసలో విషాదచాయలు

  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

  • విశాఖకు తరలిన బంధువులు

సీతానగరం, జూన్‌9(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో సీతానగరం మండలానికి చెందిన గొట్టాపు త్రినాథ్‌(50) మృతి చెందడం జిల్లావాసులు కలిచివేసింది. ప్రధా నంగా స్వగ్రామం గాదెలవలసలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాదెలవలసకు చెందిన త్రినాథ్‌ కొన్నాళ్లుగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి విశాఖలోనే ఉం టున్నారు. పెద్ద కుమారుడు పోటీ పరీక్షల కోసం విజయవాడలో శిక్షణ తీసుకుంటున్నాడు. రెండో కుమారుడు చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన త్రినాథ్‌ తల్లిదండ్రులు సాంబమూర్తి, నారాయణ మ్మ స్వగ్రామం గాదెలవలసలోనే ఉంటున్నారు. కాగా సోమవారం జరిగిన ప్రమాదంలో త్రినాథ్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు. డ్యూటీకి వెళ్లిన ఆయన ఇక ఇంటికి తిరిగి రాడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ విషయాన్ని త్రినాథ్‌ తల్లిదండ్రులకు ఇంకా చెప్పలేదు. గతంలో అనారోగ్యం కారణంగా ఓ కొడుకు చనిపోగా.. ఇప్పుడు మరో కొడుకు మృతి చెందిన విషయం తెలిస్తే వారు ఏమైపోతారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రమాదం విషయం తెలిసిన వెంటనే గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు హుటాహటిన విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు.

విచారంలో మేలాపువలస వాసులు

మక్కువ రూరల్‌: మృతుడు త్రినాథ్‌ భార్య స్వగ్రామం మక్కువ మండలం మేలాపువలసలోనూ విషాదం నెలకొంది. తమ గ్రామానికి చెందిన అల్లుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకుని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు త్రినాథ్‌ అత్తమామలకు చెందిన బంధువులు విశాఖకు బయల్దేరి వెళ్లారు. కాగా మృతుడి అత్త సింహాచలమ్మ ఇటీవల హత్యకు గురయ్యారు. మామ అప్పలనాయుడు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల కిందట మృతి చెందారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం మంత్రి నారా లోకేష్‌తో కలిసి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. కాగా జిల్లావాసి త్రినాఽఽథ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధగా ఉందన్నారు. అనంతరం మృతుని భార్య రాధను పరామర్శించి.. ఓదార్చారు. రూ.25 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో పాటు శాశ్వత ఉద్యోగం అందిస్తామని మంత్రి లోకేష్‌ హామీనిచ్చారని తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 12:08 AM