Registrations! భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు!
ABN , Publish Date - May 19 , 2026 | 11:27 PM
Irregularities in Land Registrations! సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
సాలూరులో రిజిస్ర్టేషన్ పూర్తి
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు ఆరోపణ
పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఫిర్యాదులు
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు..
విచారణ ప్రారంభించిన అధికారులు
పార్వతీపురం, మే19(ఆంధ్రజ్యోతి): సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే..
సాలూరులో డగ్లస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన భూముల రిజిస్ర్టేషన్లలో అవకతవకలు జరిగాయి. ఈ విషయంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్టు పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు అందాయి. వాస్తవంగా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పడి సుమారు నాలుగు దశాబ్దాలు గడిచిన తర్వాత మరో సొసైటీ అదే పేరున రిజిస్టర్ కావడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూములు కాజేసేందుకే 2025లో కొత్త డాక్యుమెంట్లతో పాత సొసైటీ ఏర్పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఈ భూములకు సంబంధించి రిజిస్ర్టేషన్ కూడా పూర్తి చేశారు. ఈనెల 16న ఈ ప్రక్రియ ముగించారు. దీనిపై కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు అందడంతో విచారణ ప్రారంభమైంది. ఈ నెల 18న జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి సాలూరు సబ్‌రిజిస్ర్టార్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను కూడా పిలిచి విచారించినట్టు తెలిసింది.
ఈ భూముల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి సుమారు రూ.ఐదు కోట్ల వరకు ప్రభుత్వ ఖాజానాకు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.90 లక్షలు మాత్రమే స్టాంప్ ఫీజు ద్వారా వచ్చినట్లు తెలిసింది. వ్యవసాయ భూములుగా చూపించి.. తక్కువ స్టాంప్ డ్యూటీ వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే.. మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
సుమారు నాలుగు దశాబ్దాల కిందట శ్రీకాకుళం పట్టణంలోని కోనవీధిలో డోర్ నెంబర్ 7-3-15లో డగ్లస్ విద్యా సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు సాలూరులో మూడు ఎకరాల 14 సెంట్లు భూమి ఉంది.అయితే 2025లో అదే సంస్థను మళ్లీ రిజిస్టర్ నెంబర్ 290 పేరిట తిరిగి రిజిస్ర్టేషన్ చేశారు. ఆ సంస్థకు చెందిన భూముల కోసమా.. లేక మరి దేని కోసం ఇలా రిజిస్ర్టేషన్ చేశారన్నది విచారణలో తేలాల్సి ఉంది.
ఫిర్యాదులు రావడం వాస్తవమే ..
సాలూరులో డగ్లస్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ పేరున ఉన్న భూమిని జోసెఫ్ డెనియల్ గోడే పేరున మ్యూటేషన్ చేయడంపై ఫిర్యాదులు రావడం వాస్తవమే. దీనిపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. జిల్లాలోని ఏ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలోనైనా అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు. సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడుతున్నాం.
- పార్వతి, జిల్లా రిజిస్ర్టార్, పార్వతీపురం మన్యం