Share News

Irregularities and Flaws Coming to Light! వెలుగుచూస్తున్న లోపాలు.. అవకతవకలు!

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:39 PM

Irregularities and Flaws Coming to Light! సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు గిరిజన విద్యాలయాల నిర్వహణ గాడి తప్పింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశా లల్లో... ఎక్కడ చూసినా మెనూలో లోపాలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది.

Irregularities and Flaws Coming to Light!   వెలుగుచూస్తున్న లోపాలు..  అవకతవకలు!
చిన్నబగ్గ గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల

  • కొరవడిన పర్యవేక్షణ

  • సక్రమంగా అమలు కాని మెనూ

  • బ్లాక్‌ మార్కెట్‌కు సరుకులు

  • క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు

  • విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు గిరిజన విద్యాలయాల నిర్వహణ గాడి తప్పింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశా లల్లో... ఎక్కడ చూసినా మెనూలో లోపాలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. పారిశుధ్య లోపం, సరుకుల సరఫరాలో అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు సిబ్బంది కొరతతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పాఠశాలలపై గిరిజనసంక్షేమ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పర్యవేక్షణ ఏదీ?

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో 47ఆశ్రమ పాఠశాలలు, 18పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలు, 12గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 16వేల పైగా గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ కోసం డీడీ, ముగ్గురు ఏటీ డబ్ల్యూవోలు ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. కొన్ని పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. నిత్యవసర సరు కులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. సిబ్బంది బాధ్యతరాహిత్యం, గిరిజన విద్యార్థులతో పనులు చేయించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా కొద్ది రోజులుగా ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోతో పాటు ఏపీవో స్థాయి అధికారులు తరుచూ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.

వేధిస్తున్న అధికారుల కొరత

సీతంపేట, మెళియాపుట్టిలో ఏటీడబ్ల్యూవో పోస్టులు గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. డీడీగా ఉన్న అన్నాదొర సీతంపేట ఏటీడబ్ల్యూవోగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మెళియా పుట్టి ఏటీడబ్ల్యూవో బాధ్యతలను రెగ్యులర్‌ వార్డెన్‌కు అప్పగించారు. ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఏఎన్‌ఎంలను కూడా ఇంతవరకు నియమించక పోవడంపై గిరిజనసంఘాల నాయకులు మండిపడుతున్నారు.

ప్రతినెలా ఐవీఆర్‌ఎస్‌ సర్వే

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాలపై ప్రభుత్వం ప్రతి నెలా ఐవీఆర్‌ ఎస్‌(ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం)సర్వే చేస్తోంది. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పిల్లల చదువులు, ఆరోగ్యం, భోజన వసతి సౌకర్యాలు, పర్యవేక్షణ వంటి అంశాలపై వివరాలు సేకరిస్తోంది. అయితే సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఐటీడీఏ అధికారులను అప్రమత్తం చేసినట్లు బోగట్టా. దీనిలో భాగంగానే ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఇటీవల కాలంలో గిరిజన విద్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పాఠశాలలపై వచ్చిన ఆరోపణలు, తనిఖీల్లో వెలుగుచూసిన లోపాలపై ఆయా పాఠశాలల సిబ్బందిపై చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చర్యలు

- పూతికవలస ఆశ్రమ పాఠశాలలో మెనూ సరుకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు ఇటీవల సంబంధిత పాఠశాల డిప్యూటీ వార్డెన్‌, పీడీని సస్పెండ్‌ చేశారు.

- మర్రిగూడ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్‌ మద్యం తాగి విధులు నిర్వర్తిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టి కొద్దిరోజుల కిందట సదరు ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

- ఇటీవల బుడగరాయి, చిన్నబగ్గ బాలుర ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస సంఘటనలు చోటుచేసుకోవడం, దీనికి బాధ్యులైన సిబ్బందిపై పీవో కొరడా ఝళిపించారు. దీంతో గిరిజనసంక్షేమశాఖ అధికారులతో పాటు ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల పాఠశాలల సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే...

‘సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆయా పాఠశాలల విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. గిరిజన విద్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులనూ కూడా ఆదేశించాం. గిరిజన విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.’ అని ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Apr 18 , 2026 | 11:39 PM