Share News

Investment boost for North Andhra ఉత్తరాంధ్రకు పెట్టుబడుల ఊతం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:18 AM

Investment boost for North Andhra ఉత్తరాంధ్రలో మౌలిక వసతులు, పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చే కీలక ప్రకటనలు వెలువడ్డాయి. శ్రీకాకుళంలో విమానాశ్రయానికి అవసరమైన భూమికి ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

Investment boost for North Andhra ఉత్తరాంధ్రకు పెట్టుబడుల ఊతం
పరిశ్రమల ఔత్సాహికులతో ఒప్పందం చేసుకుంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల ఊతం

శ్రీకాకుళంలో విమానాశ్రయానికి భూమి క్లియరెన్స్‌

అనకాపల్లిలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌

భోగాపురంలో 800 ఎకరాల్లో ఏరో సిటీ

విశాఖలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌

విశాఖ రీజియన్‌ నుంచే 50 శాతం పర్యాటక ఆదాయం

ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో వక్తలు

విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో మౌలిక వసతులు, పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చే కీలక ప్రకటనలు వెలువడ్డాయి. శ్రీకాకుళంలో విమానాశ్రయానికి అవసరమైన భూమికి ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. విమానాశ్రయాలు రాకపోకలకు కనెక్టివిటీ అందించడమే కాకుండా ఆ ప్రాంతం మినీ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయన్నారు. అనకాపల్లిలో మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భోగాపురంలో 800 ఎకరాల్లో జీఎంఆర్‌ ఏరో సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ వెల్లడించారు. ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంలో బుధవారం సీఐఐ, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఈ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా పలు ఎంవోయూలు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి.

22.6 లక్షల కోట్ల ప్రాజెక్టులు

2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు 22.6 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. వీటి ద్వారా 9.3 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.5 లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ దశకు చేరుకుంటున్నాయని చెప్పారు. ఈ సదస్సులో రూ.37 వేల కోట్ల విలువైన 229 ఎంవోయూలు చేసుకుంటున్నామని, వీటి ద్వారా 92 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. సుమారు రూ.5 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నక్కపల్లి వద్ద ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ దాదాపు రూ.1.35 లక్షల కోట్లతో 18 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టును చేపడుతోందన్నారు. దీని ద్వారా 55 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఉందన్నారు. గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లతో ఒక గిగావాట్‌ ఏఐ హబ్‌, రిలయన్స్‌ 17 బిలియన్‌ డాలర్లతో 1.5 గిగావాట్‌ ఏఐ క్లస్టర్‌ నిర్మిస్తున్నాయని తెలిపారు. 2030 నాటికి రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

సరకు రవాణా ఖర్చు తగ్గింపు

రాష్ట్రంలో సరకు రవాణా వ్యయాన్ని తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు రోడ్డు, రైలు, పోర్టు, విమానాశ్రయ కనెక్టివిటీ కీలకమని, మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.

2024-25, 2025-26లో ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా సుమారు రూ.25 వేల కోట్లతో 1530 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. అమరావతి రింగ్‌ రోడ్డుకు రూ.31 వేల కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. విశాఖలో రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు పనిచేస్తున్నాయని, అనకాపల్లిలో మరో పార్కు ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆరు ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ పార్కులు, 22 టెర్మినళ్లు, 300 కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

విశాఖలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌

విశాఖలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. భీమిలి బీచ్‌రోడ్డులోని యూనిటీ మాల్‌లో మరో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ రీజియన్‌ నుంచే రాష్ట్ర పర్యాటక ఆదాయంలో 50 శాతం వస్తోందని శ్రవణ్‌ షిప్పింగ్‌ అధినేత జి.సాంబశివరావు తెలిపారు. రాష్ట్రంలో తొలి సెమీకండక్టర్‌ పరిశ్రమ తర్లువాడలో ఏర్పాటవుతుందని ఫ్లూయింట్‌ గ్రిడ్‌ అధిపతి, సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు గన్నమనేని మురళీకృష్ణ తెలిపారు. వివిధ వ్యాపారాల కోసం రాష్ట్రంలో 23 క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. భోగాపురం ఏరో సిటీతో ఉపాధి, నైపుణ్య శిక్షణకు అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ తెలిపారు. నవంబరు 12,13 తేదీల్లో 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ విశాఖలో జరగనుందని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. పెట్టుబడిదారులు కేవలం సదస్సు కోసం కాకుండా ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలతో ఏపీకి రావాలని పిలుపునిచ్చారు. గంభీరం ఐఐఎం డైరక్టర్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రూ.475 కోట్ల విలువైన ప్రాంగణం నిర్మించుకోగలిగామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, లోకం మాధవి, నడుకుర్తి ఈశ్వరరావులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:18 AM