Share News

కేసుల దర్యాప్తు వేగవంతం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:18 AM

కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేసినప్పుడే పోలీస్‌ శాఖకు గౌరవం పెరుగుతుందని.. నేరం చేయాలంటే భయం కలుగుతుందని ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి అన్నారు.

కేసుల దర్యాప్తు వేగవంతం
నేర సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

- నిందితులకు శిక్షపడేలా చేయాలి

- ‘ఇంటింటికీ మన్యం పోలీసు’ను విస్తృతం చేయాలి

- ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేసినప్పుడే పోలీస్‌ శాఖకు గౌరవం పెరుగుతుందని.. నేరం చేయాలంటే భయం కలుగుతుందని ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి అన్నారు. గురువారం పోలీసు సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జనసమూహాలు ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో, ప్రజా కార్యక్రమాల్లో విధులు నిర్వహించే సిబ్బంది బాడీవోర్న్‌ కెమెరాలను కచ్చితంగా వినియోగించాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, హింసాత్మక ప్రాంతాల్లో నిరంతర డ్రోన్‌ పోలీసింగ్‌ చేయాలని ఆదేశించారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని హైపర్‌ సెన్సిటివ్‌ గ్రామాలు, సున్నితమైన ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. దత్తత గ్రామాల్లో మన్యంతో మమేకం కార్యక్రమాన్ని విస్తృతం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఈ చలానా, డ్రంకెన్‌ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సారా నివారణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో వాట్సప్‌ గవర్నన్స్‌ సేవలు ప్రజలకు కనబడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి కేసుల దర్యాప్తు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సాంకేతికతను జోడించి పెండింగ్‌ కేసులను త్వరతిగతిన పరిష్కరించాలని సూచించారు. డిజిటల్‌ పోలీసింగ్‌ వ్యవస్థను అమలు చేయడం ప్రారంభంలో కష్టతరంగా ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో నేరాల దర్యాప్తుకు ఎంతో ఉపయోగపడనుందని వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్‌రెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:18 AM