Share News

స్పందన హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - May 07 , 2026 | 12:14 AM

రాజాం మున్సిపాలిటీ పరిధి డోలపేటలోని ముంజేటివీధికి చెందిన స్పందన హత్య కేసుకు సంబంధించి రాజాం పొలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు

 స్పందన హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

రాజాం రూరల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రాజాం మున్సిపాలిటీ పరిధి డోలపేటలోని ముంజేటివీధికి చెందిన స్పందన హత్య కేసుకు సంబంధించి రాజాం పొలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మృతురాలి కుమారుడు సుశాంత్‌ వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అయిదు బృందాలు సుశాంత్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. సుశాంత్‌తో పాటు డోలపేటలోని మారుతీనగర్‌కు చెందిన బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతని తల్లిదండ్రులను రాజాం ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు బుధవారం పొలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.

ఒక్కరేనా?

డోలపేటలోని ఓ బాలుడు, మృతురాలి కుమారుడు సుశాంత్‌ కొన్నాళ్లుగా స్నేహంగా మెలుగుతున్నారు. ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో తన స్నేహితుడితో ఇంటికి వచ్చిన సుశాంత్‌ కొద్ది గంటల తరువాత కనిపించకుండా పోయాడు. అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన స్పందన భర్త సతీష్‌ తన భార్య కనిపించకపోవడంతో ఇంట్లో పరిస్థితులు గమనించి చోరీ జరిగిందని గుర్తించి పొలీసులకు సమాచారం అందించారు. కాసేపటి తరువాత గాయాలతో ఇంటి వెనుకభాగంలో ముళ్లపొదల్లో భార్య స్పందన మృతదేహాన్ని సతీష్‌ గుర్తించారు. పొలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని బీరువాలో ఉండాల్సిన సుమారు పది తులాల బంగారు ఆభరణాలు, రూ.5 వేల నగదు చోరీకి గురయ్యాయని మృతురాలి తల్లి ఉమ రాజాం పొలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంగారం, నగదు చోరీతో పాటు స్పందన హత్య ఒకరే చేశారని పొలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్‌తో పాటు వెంట ఉన్న మరో బాలుడి తండ్రి వీఆర్వోగా పనిచేస్తున్నట్లు తెలిసింది. రాజాం ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసరావు బుధవారం స్టేషన్‌లో కొంతమందిని విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - May 07 , 2026 | 12:14 AM