Share News

'Intintiki TDP' మొక్కుబడిగా ‘ఇంటింటికీ టీడీపీ’

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:31 PM

'Intintiki TDP' campaign reduced to a mere formality కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. జూలైలో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం ప్రారంభంలో కాస్త చురుగ్గా సాగింది. ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున భాగస్వాములై శ్రేణుల్లో జోష్‌ నింపారు. అయితే మొదట్లో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం ఆ తర్వాత నెమ్మదిస్తూ వచ్చింది.

 'Intintiki TDP'  మొక్కుబడిగా ‘ఇంటింటికీ టీడీపీ’

  • క్షేత్రస్థాయిలో కనిపించని జోష్‌

  • ఫొటో ఫోజులకే పరిమితం

  • ప్రభుత్వ పథకాలు.. అభివృద్ధిని ప్రజలకు వివరించలేకపోతున్న వైనం

  • పలుచోట్ల గ్రూపులు.. తప్పుకుంటున్న బూత్‌ ఇన్‌చార్జిలు

పార్వతీపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. జూలైలో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం ప్రారంభంలో కాస్త చురుగ్గా సాగింది. ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున భాగస్వాములై శ్రేణుల్లో జోష్‌ నింపారు. అయితే మొదట్లో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం ఆ తర్వాత నెమ్మదిస్తూ వచ్చింది. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాల్సిన వారు ఫొటో ఫోజులకే పరిమితమవుతున్నారు. 45 రోజుల పాటు కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ప్రతి ఇంటికీ వెళ్లాలని.. కార్యక్రమం విజయవంతం చేయా లని పార్టీ అధిష్టానం ఆదేశించినా.. కొంతమందికి పట్టడం లేదు. తూతూమంత్రంగా కార్యక్రమం జరిపి మమ అనిపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హాజరైనప్పుడు హడావుడి చేసి.. ఆ తర్వాత రెండు, మూడు ఇళ్లను సందర్శించి వెనుదిరుగుతున్నారు.

వాస్తవంగా వైసీపీ సర్కారు తప్పిదాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండేది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పరిపాలన అనుభవంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడు తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉంది. కానీ ఎందుకో జిల్లా నేతల్లోని కొంతమంది ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ అప్పటి అధికార పార్టీపై విమర్శలు గుప్పించి.. సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం చేసిన వారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. పలు నియోజకవర్గాల్లో కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఇంటింటికీ టీడీపీ కరపత్రాన్ని ఇచ్చి ఫొటోల ఫోజులిచ్చి మాయమవుతున్నారు. ఆ తర్వాత ఆ ఫొటోలను టీడీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి మమ అనిపిస్తున్నారు. ‘ బూత్‌ పరిధిలో ఎన్ని ఫొటోలు అప్‌లోడ్‌ చేశాం. ఎంత పర్సంటేజ్‌ అయింది.’ అనేది మాత్రమే బూత్‌ ఇన్‌చార్జిలు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీని మరింత పటిష్ఠపరిచే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

ఆశావహుల సందడి

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో కాస్త చురుగ్గా తిరుగుతున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్తూ.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. ప్రజల్లో ఏదో ఒక రకంగా గుర్తింపు పొందడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

నియోజకవర్గాల్లో గ్రూపులు

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రూప్‌లుగా ఏర్ప డ్డారు. దీంతో ఎవరికి వారు తమ గ్రూప్‌తో ప్రజల్లోకి వెళ్లి.. ఫొటోలు తీసుకుని టీడీపీ యాప్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. గ్రుపులుగా తిరుగుతూ శ్రేణులు, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.

వెనకడుగు వేస్తున్న బూత్‌ ఇన్‌చార్జిలు

జిల్లాలో టీడీపీకి చెందిన కొంతమంది బూత్‌ ఇన్‌చార్జిలు ఇంటింటికీ తెలుగదేశం కార్య క్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డారు. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణమే ఇందుకు కారణం. దీంతో చాలాచోట్ల బూత్‌ ఇన్‌చార్జిలు సక్రమంగా పనిచేయడం లేదు. తమకెం దుకులే అని పక్కకు తప్పుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే.. స్థానిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీనిపై అధిష్ఠానం పెద్దలు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:31 PM