Share News

బస్సు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:28 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన గురువారం రాత్రి ఎస్‌.కోట మండలంలోని పోతనాపల్లి జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది.

బస్సు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

ఎస్‌.కోట రూరల్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన గురువారం రాత్రి ఎస్‌.కోట మండలంలోని పోతనాపల్లి జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంట్యాడ మండలం మదుపాడ గ్రామానికి చెందిన కొయినాన నారాయణరావు మండలంలోని సీతంపేట గ్రామంలో ఒక వ్యక్తి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు స్వామినాయుడు(17) జామి మండలం భీమసింగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ రెండో సంవ త్సరం చదువుతున్నాడు. చిన్నకుమారుడు పోతనాపల్లి గ్రామం వద్ద ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. స్పెషల్‌ క్లాస్‌లకు వెళ్లిన తన తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చేందుకు గురువారం రాత్రి స్వామినాయుడు పోతనాపల్లి జంక్షన్‌ వద్దకు వెళ్లాడు. తమ్ముడిని మదుపాడ తీసుకువస్తున్న క్రమంలో నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న సమయంలో ఎస్‌.కోట నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో స్వామినాయుడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. శుక్రవారం హాస్టల్‌కు వెళ్లిపోతాడనగా ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ కేసును సీఐ నారాయణమూర్తి నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:28 AM