Intermediate Examinations రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:14 AM
Intermediate Examinations Begin from Tomorrow జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 33 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
హాజరుకానున్న 17,530 మంది విద్యార్థులు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పార్వతీపురం/బెలగాం/సాలూరు రూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 33 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు మించి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. ఇంటర్ ప్రథమ సంవ త్సరంలో జనరల్ విద్యార్థులు 5,938 మంది, వృత్తివిద్య విద్యార్థులు 2,849 మంది హాజరు కానున్నారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ విభాగంలో 6,127 మంది, వృత్తివిద్య విద్యార్థులు 2,616 మంది పరీక్షలు రాయనున్నారు. పర్యవేక్షణకు 33 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, 495 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, మొబైల్ స్క్వాడ్లును నియమిం చారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నారు. ప్రత్యేకంగా జిల్లా పరిశీలకులు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలిం చనున్నారు. విద్యార్థులకు ఏమైన సమస్యలు తలెత్తేతే 99898 10910కి ఫోన్ చేయొచ్చు. కాగా గతేడాది 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వగా ప్రస్తుతం మొదటి సంవత్సర పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో ప్రశ్నల సంఖ్య పెరగడంతో 32 పేజీల బుక్‌లెట్ అందిం చనున్నారు. విద్యార్థులు బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం 24 పేజీల బుక్‌లెట్‌ను అందిం చనున్నారు. మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ‘ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫర్నిచర్‌తో పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. విద్యుత్‌కు అంతరాయంగా లేకుండా చూడాలని ఆయా శాఖాధికారులకు సూచించాం. మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలకు వీలులేకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి అనుమతిస్తాం. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, పోలీస్, వైద్య సిబ్బంది, స్క్వాడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. ’ అని డీఐఈవో నాగేశ్వరరావు తెలిపారు.
సర్వం సిద్ధం : కలెక్టర్
ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ పోన్లు లేదా ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లును అందుబాటులో ఉంచామన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం 14 అదనపు బస్సులను నపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. హాల్ టిక్కెట్లు చూపించి విద్యార్థులకు ఉచిత ప్రయాణం చేయొచ్చని కలెక్టర్ తెలిపారు.