అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:05 AM
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ జిల్లా దొంగల ముఠా సభ్యులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ పైడిపునాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 11 కేసులు
శ్రీకాకుళం క్రైం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ జిల్లా దొంగల ముఠా సభ్యులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ పైడిపునాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం రూరల్, గార, జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్ల పరిధితో పాటు విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, డెంకాడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పట్నాల రంజిత్, కొలుసు దుర్గా ప్రసాద్, పట్నాల ఢిల్లీశ్వరరావు, చెల్లుబోయిన కామేశ్వరరావు, ముంత దుర్గాప్రసాద్, కొలుసు శివ కుమార్ దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. గత కొంతకాలంగా ఆలయాలతో పాటు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ వీరు చోరీలు చేశారని పేర్కొన్నారు. వీరిపై రెండు జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యా యన్నారు. వీరి వద్ద నుంచి రూ.1,17,450 నగదుతో పాటు రూ.40 వేలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం కేసులను త్వరితగతిన చేధించిన శ్రీకాకుళం డీఎస్పీతో పాటు సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారని పేర్కొన్నారు. సమావేశంలో వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ, గార ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు తదితరులు పాల్గొన్నారని ఆ ప్రకటనలో తెలిపారు.