Inter exams in CCTV surveillance సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:40 PM
Inter exams in CCTV surveillance ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలో 15 కెమెరాలు అమర్చామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శివ్వాల తవిటినాయుడు తెలిపారు. జిల్లాలో ఏ పరీక్ష కేంద్రంలో కూడా విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదన్నారు.
సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు
నేలపై కూర్చుని పరీక్ష రాయడానికి లేదు
చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే కీప్యాడ్ ఫోన్
8.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి
లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణ
‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా ఇంటర్ విద్యా అధికారి తవిటినాయుడు
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి):
ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలో 15 కెమెరాలు అమర్చామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శివ్వాల తవిటినాయుడు తెలిపారు. జిల్లాలో ఏ పరీక్ష కేంద్రంలో కూడా విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదన్నారు. ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ఆదివారం ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి కేంద్రంలోని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మంచి నీరు అందుబాటులో ఉంటుందని, మరుగుదొడ్లులు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించామన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
విద్యార్థులు 8.30కు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 నిమిషాలకు ప్రతి విద్యార్థి కేంద్రంలో ఉండాలి. 9 గంటలు దాటితే అనుమతించేది లేదు. 8.45 నిమిషాలకు పరీక్ష పేపర్ల సీల్ తొలగిస్తాం. మధ్యాహ్నం 12 గంటల తరువాతే పరీక్ష కేంద్రం నుంచి బయటకు రావాలి.
66 కేంద్రాల్లో పరీక్షలు
ఇంటర్ పరీక్షలకు మొత్తం 39,037 మంది హాజరుకానున్నారు. వీరికోసం జిల్లాలో 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉండగా, 45 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు 66మంది చీఫ్‌లు, 66 మంది డిపార్ట్‌మెంట్ అధికారులతో పాటు 1,000మంది ఇన్విజిలేటర్లను నియమించాం. 400 మంది ప్రభుత్వ పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, 600 మంది ప్రైవేటు జూనియర్ కాలేజీలకు చెందిన అధ్యాపకులు ఇన్విజిరేటర్లుగా విధుల్లోకి తీసుకున్నాం. 58 జంబ్లింగ్ కేంద్రాలు కాగా 8 క్లబ్ సెంటర్లు ఉన్నాయి. ఈ క్లబ్ సెంటర్ల పరిఽధిలో ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పక్కనే ఉన్న ప్రైవేటు కళాశాల విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
ఫొటోలు లేని హాల్ టిక్కెట్లు ఇస్తే..
జిల్లాలో ఆరుగురు విద్యార్థులకు హాల్ టిక్కెట్లపై ఫొటోలు లేనిట్లు గుర్తించాం. అటువంటి కాలేజీ యాజమాన్యానికి వెయ్యి రూపాయలు చొప్పున ఫైన్ విధించాం. ఫొటోలు ఉన్న హాల్ టిక్కెట్లనే పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాలి. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో పాటు పెన్ను, పెన్సిల్, స్కేల్, ఎరైజర్, ప్యాడ్ తీసుకువెళ్లాలి. ఎలక్ర్టానిక్ వాచీలను తీసుకువెళ్లకూడదు.
సీఎస్‌కి మాత్రమే కీపేడ్ ఫోన్
పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించాం. డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, పోలీసు, వైద్యసిబ్బంది, స్క్వాడ్ అఽధికారులు, ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. చీప్ సూపరింటెండెంట్‌లకు మాత్రమే కీపేడ్ ఫోన్లను ఇంటర్ బోర్టు అందిస్తోంది. సమాచారం కోసం మాత్రమే సమకూర్చుతోంది. ఎటువంటి స్మార్ట్ ఫోన్లకు అనుమతి లేదు. ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు కూడా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది అంతా తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలి. పరీక్షలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఆర్‌ఐవో కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోలు రూం ఏర్పాటు చేశాం. ల్యాండ్ లైన్ 08922-237988, సెల్ 9059926425 నెంబర్లు కేటాయించాం.
ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే వరకూ కంగారుగా చదవడం మంచి పద్ధతి కాదు. ఇచ్చిన ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని పరీక్ష రాయాలి. ఈసారి మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రం ఇస్తారు. వీరు గణితం,ఫిజిక్స్, కెమెస్ట్రీ, చరిత్ర, అర్థ శాస్త్రం, సివిక్స్, కామర్స్ సబ్జెట్లను రాయాల్సి ఉంది. రెండో సంవత్సర విద్యార్థులకు పాత పద్ధతిలోనే 24పేజీల జవాబు పత్రం ఇస్తారు.