ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:14 AM
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
- మొదటి రోజు 862 మంది విద్యార్థులు గైర్హాజరు
- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు జరిగిన తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు 862 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 8 గంటలకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు మాత్రం 8.30 దాటి వచ్చారు. ఇలాంటి వారు కేంద్రాలకు చేరుకోవడానికి పరుగులు తీశారు. జనరల్ గ్రూపునకు సంబంధించి 17,997 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా, 17,490 మంది హాజరయ్యారు. 507 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ఒకేషనల్ గ్రూప్‌కు సంబంధించి 2,433 మంది పరీక్ష రాయల్సి ఉండగా 2,078 మంది రాశారు. మొత్తం 20,430 మంది విద్యార్థులకు గాను 19,568 మంది పరీక్ష రాశారు. పట్టణంలోని కేఎల్‌పురంలో ఉన్న లక్ష్మి గణపతి జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తనిఖీ చేశారు. కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థులు హాజరు శాతంపై ఆరా తీశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తవిటినాయుడు నాలుగు కేంద్రాలను తనిఖీ చేశారు.