Insufficient Funds నిధులు చాలక.. ఇళ్లు కట్టలేక!
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:49 PM
Insufficient Funds Leave Houses Unbuilt! పెద్దగెడ్డ ప్రాజెక్టు పరిధిలోని ఓ నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ముంపు గ్రామంలోనే కొటికిపెంట వాసులు ఉండాల్సి వస్తోంది.
ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కారం కాని సమస్య
ఇంకా ముంపు గ్రామంలోనే కొటికిపెంట వాసులు
పాచిపెంట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పెద్దగెడ్డ ప్రాజెక్టు పరిధిలోని ఓ నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ముంపు గ్రామంలోనే కొటికిపెంట వాసులు ఉండాల్సి వస్తోంది. వాస్తవంగా పెద్దగెడ్డ జలాశయానికి వంద మీటర్లు దూరంలో ఉన్న ప్రాంతాలను ముంపు గ్రామాలుగా గుర్తించారు. వాటిలో కోడికాళ్లవలస, కేసలి, కొటికిపెంట ఉన్నాయి. కోడికాళ్లవలస, కేసలి వాసుల కోసం నిర్వాసిత కాలనీ నిర్మించారు. కోడికాళ్లవలసకు సంబంధించి దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్త య్యాయి. ఇక్కడ నిర్వాసితులు ఉంటున్నారు. కేసలికి సంబంధించి అతికొద్దిమంది మాత్రమే గృహ నిర్మాణాలు చేపట్టారు.
ఇక కొటికిపెంట విషయానికొస్తే..283 కుటుంబాల పునరావాసం నిమిత్తం జలాశయం సమీపంలో సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలం కొనుగోలు చేసి సిమెంటు రోడ్లు నిర్మించారు. అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 50 వేలు చొప్పున మంజూరు చేశారు. అయితే ఈ నిధులు సరిపోవని నిర్వాసితులు తెలిపారు. గృహ నిర్మాణాలకు నిధులు పెంచాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాలయాపన జరిగిందే తప్ప నిధులు పెంచలేదు. దీంతో కొటికిపెంట నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం జరగలేదు. కాలనీ ఏర్పాటు కాకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఇంకా ముంపు గ్రామంలోనే ఉంటున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. కానీ ఇక్కడలా జరగలేదు. సుమారు 19 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పునరావాసం కల్పించకపోవడంతో నిర్వాసితులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుండడంతో కొంతమంది నిర్వాసితులు వాటికోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ‘ ముంపు గ్రామంలో అవస్థలు పడుతున్నాం. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి నిధులు పెంచాలి. నిర్వాసిత కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.’ అని కొటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు, నిర్వాసితుడు కునుకు సత్యనారాయణ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ రవిని వివరణ కోరగా.. ‘నిర్వాసిత కాలనీలో ఇళ్ల నిర్మాణాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. నిర్వాసితులు కూడా ప్రభుత్వం మంజూరు చేసే నిధులు వినియోగిం చుకోవాలి.’ అని తెలిపారు.