కొత్తవలస రైల్వేస్టేషన్ పనుల పరిశీలన
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:34 AM
కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ పథకం కింద సుమారు రూ.18 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మిస్తున్న కొత్తవలస రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను రైల్వే శాఖకు చెందిన చీఫ్ అడ్మినిస్ర్టేటివ్ అధికారి అంకుష్ గుప్త శుక్రవారం పరిశీలించారు.
కొత్తవలస, జనవరి 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ పథకం కింద సుమారు రూ.18 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మిస్తున్న కొత్తవలస రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను రైల్వే శాఖకు చెందిన చీఫ్ అడ్మినిస్ర్టేటివ్ అధికారి అంకుష్ గుప్త శుక్రవారం పరిశీలించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతో ఏఏ పనులు చేస్తున్నారనే విషయాన్ని ఆయన పరిశీలించారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు 90 శాతం పూర్తయినట్టు కాంట్రాక్టర్ వివరించారు. రైల్వేస్టేషన్‌కు సంబంధించిన నూతన భవనాలు 50 శాతం పూర్తయినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారాల విస్తరణతో పాటు, మరికొన్ని ప్లాట్‌ఫారాల పొడవు పెంపు కోసం తీసుకుంటున్న విస్తరణ పనులను పరిశీలించారు. అలాగే ఒకటి, రెండు, ఐదు ప్లాట్‌ఫారాలపైకి వెళ్లడానికి నిర్మాణం చేస్తున్న లిఫ్ట్ పనులను పర్యవేక్షించారు. రైల్వేస్టేషన్ భవనాలకు సంబంధించి నాణ్యత లేని ఇటుకలను వాడడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఇటుకలను, సిమెంట్, మెటీరియల్‌ను వినియోగించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.