కొత్తవలస డంపింగ్ యార్డు సమస్యపై విచారణ
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:22 AM
కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించిన డంపింగ్‌యార్డు సమస్యపై శనివారం స్థానిక కోర్టులో సివిల్ న్యాయాధి కారి డా.సముద్రాల విజయ్ చందర్ విచారణ నిర్వహించారు.
కొత్తవలస, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించిన డంపింగ్‌యార్డు సమస్యపై శనివారం స్థానిక కోర్టులో సివిల్ న్యాయాధి కారి డా.సముద్రాల విజయ్ చందర్ విచారణ నిర్వహించారు. రాజన్న కాలనీ సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ కాలనీవాసులు గత ఐదు నెలలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో జనసేన పార్టీ నేత వబ్బిన సన్యాశినాయుడు, కాలనీవాసులు.. కొత్తవలస సివిల్ న్యాయాధికారి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం విచారణ నిర్వహించారు. ప్రభుత్వం తరపున కౌంటర్ వేయడానికి 15 రోజులు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా.. సెప్టెంబరు 5వ తేదీకి వాయిదా వేశారు. డంపింగ్ యార్డు వల్ల ఉన్న సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తాను ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు, న్యాయవాద సంఘం అధ్యక్షుడు ఓవీ మురళీ కృష్ణ ఈనెల 25న వస్తామని న్యాయాధికారి కాలనీవాసులకు తెలిపారు.