Water Resource నీటి వనరుల సంరక్షణకు వినూత్న ప్రణాళిక
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:24 AM
Innovative Plan for Water Resource Conservation జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు వినూత్న ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు వినూత్న ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. రీసర్వే, జలధార వంటి పలు అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూగర్భ జల మట్టాలను పెంచేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన మ్యాపింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. శాటిలైట్స్ , ఓఆర్‌ఐ మ్యాప్స్ ద్వారా వర్షపు నీరు ఎక్కడ పడుతుంది, ఏ చెరువులోకి వెళ్తుంది , ఎక్కడ అదనంగా నిల్వ ఉంది? అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డేటా బేస్ రూపొందిస్తున్నట్టు వివరించారు. మండలాల్లో మరో 1600 పనులను గుర్తించామన్నారు.
‘జలధార’లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి..
జలధార కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో 800 చెరువులను గుర్తించి వాటిని అభివృద్ధే లక్ష్యంగా ఎంపీడీవోలు పనిచేయాలన్నారు. జిల్లాలోని నీటి వనరులను మరింత పెంపొందించాలని ఆదేశించారు. నీటి భద్రతను బలోపేతం చేసే పనులను గ్రామ, మండల స్థాయిలో గుర్తింపు ప్రతిపాదించాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం నిధులను సమర్ధవంతంగా వినియోగిస్తూ.. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని సుమారు ఆరు వేల చెరువుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వాటిల్లో 2,600 చెరువులకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతగా 135 చెరువులను ఎంపిక చేశామని, వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వేలం ద్వారా పంచాయతీలకు జమ చేయాలని సూచించారు. పనుల వివరాలను మొబైల్ యాప్ ద్వారా వెంటనే అప్‌లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, జిల్లా ప్రణాళిక అధికారి పట్నాయక్, భూగర్భ జలవనరులు, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.