infilter well on sad position ‘బావు’రుమంటున్నాయ్
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:06 AM
infilter well on sad position ఈ ఏడాది కూడా ఎండలు మండే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆ చాయలు ప్రస్ఫుటమవుతున్నాయి. రథసప్తమి తరువాత వాతావరణం మారింది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవచ్చునని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘బావు’రుమంటున్నాయ్
నదుల్లో ఊటబావులకు పొంచిఉన్న ముప్పు
వాటి చెంతనే భారీగా ఇసుక తవ్వకాలు
వేసవిలో తాగునీటి సరఫరాలో వీటిపాత్ర కీలకం
క్రాష్ ప్రోగంలోనైనా చర్య తీసుకుంటారా?
ఈ ఏడాది కూడా ఎండలు మండే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆ చాయలు ప్రస్ఫుటమవుతున్నాయి. రథసప్తమి తరువాత వాతావరణం మారింది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవచ్చునని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో నదుల్లోని ఊటబావుల సంరక్షణ అత్యవసరం. అవి బాగుంటేనే తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుంది. కానీ జిల్లాలో చాలా చోట్ల అవి దయనీయ స్థితిలో ఉన్నాయి. ఎస్.కోట, బొబ్బిలి, నెల్లిమర్ల మండలాల్లో వాటి సంరక్షణ గాలికి వదిలేశారు. వెంటనే క్రాష్ ప్రోగ్రం చేపట్టి వీటి రక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
విజయనగరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి):
విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు మేజర్ పంచాయతీల్లో తాగునీటి వ్యవస్థ సరిగా లేదు. మరోవైపు వేసవి సమీపిస్తోంది. ఇప్పటికే ఆ చాయలు కనిపిస్తున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ తరుణంలో తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు అవశ్యం. గ్రామాలు, పట్టణాల్లో వేసవిలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారుల్లో ముందుచూపు కానరావడం లేదు. నాగావళి, చంపావతి నదుల చెంత గ్రామాల్లో ఊటబావులే ఆధారం. వాటిని చూస్తే దయనీయ స్థితిలో ఉన్నాయి. బావుల చెంతనే ఇసుకను భారీగా తవ్వేస్తున్నారు. భూమి లోపలకు ఉండాల్సిన బావులు బయటకే కనిపిస్తున్నాయి. కొన్ని లీకులమయంగా మారి నీరు కలుషితమవుతోంది.
చంపావతి పరివాహక ప్రాంతాల్లో..
జిల్లాలో చంపావతి నది మెంటాడ, గజపతినగరం, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల మీదుగా దాదాపు 100 కిలోమీటర్లు మేర ప్రవహించి కోనాడ వద్ద సముద్రంలో కలుస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 200 గ్రామాలకు తాగునీరు అందించే 86 తాగునీటి పథకాలకు సంబంధించి ఊటబావులు ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది మందికి తాగునీరు అందుతోంది. నెల్లిమర్ల, రామతీర్థం వద్ద ఉన్న ఊటబావులు విజయనగరం కార్పొరేషన్ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి. కానీ వేసవిలో ఈ పరిస్థితి ఉంటుందా అనేది అందరి సందేహం. ఊటబావుల చుట్టూ ఇసుక తోడేయడంతో నీరు కలుషితమవుతోంది. కోళ్ల వ్యర్థాలను సైతం అక్కడే పారబోస్తున్నారు. గత ఏడాది గుర్ల డయేరియా ఘటనలకు తాగునీరే కారణమని నివేదికలు వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు వాటిపై దృష్టిసారించాల్సి ఉంది.
నాగావళిలోనూ అంతే..
రేగిడి మండలం సంకిలి వద్ద నాగావళిలో ఊటబావులను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో 231 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. సంకిలి వద్ద సుజలధార పథకం ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే ఈ నదిలో ఉన్న ట్యాంకుల్లోకి చెత్త, వ్యర్థాలు చేరుతుండడంతో అస్తవ్యస్తంగా మారుతోంది. తరచూ నీరు కలుషితం అవుతోంది.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాం. తాగునీటి వనరుల నిర్వహణపై దృష్టిపెట్టాం. క్రాష్ ప్రోగ్రం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపించాం. వేసవిలో దాహం కేకలు లేకుండా చూడాలన్నదే లక్ష్యం. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించాం. మేజర్ ఇబ్బందులు ఉంటే జిల్లా స్థాయినుంచి పర్యవేక్షించి పరిష్కరిస్తాం.
- కవిత, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, విజయనగరం