పరిశ్రమలను వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - May 30 , 2026 | 12:45 AM
జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి సంబంధింత శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
- అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం,కలెక్టరేట్ మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి సంబంధింత శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాఽధికా వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేటు లిమిడెట్ రూ.240 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 304 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. సూపర్ స్పిన్నర్స్ లిమిటెడ్ కార్న్ ఫీడ్ సముదాయం కోసం రూ.857 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదనలు సమర్పించిందన్నారు. మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సమగ్ర ఉక్కు పరిశ్రమ కోసం రూ.2063 కోట్లతో ప్రాజెక్టు చేపడుతుందన్నారు. దీనిద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. జేఎస్టీడబ్ల్యూ ఇండస్ర్టీయల్ పార్క్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మల్టీ యుటిలిటీ ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు కోసం రూ.531 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. దీనిద్వారా సుమారు 45 వేలు మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. భూసేకరణ, సర్వే నెంబర్లు సమస్యల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంవోయూ ప్రాజెక్టుల కింద స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ రూ.3,450 కోట్లతో ఉక్కు తయారీ పరిశ్రమ, స్టీల్ ఎక్స్చేంజ్ ఇన్‌ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ రూ.1200 కోట్లతో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, ఈ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అన్సుమి స్పేస్ కార్పొరేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో రూ.600 కోట్ల పెట్టుబడితో ముందుకు రాగా, వైశాఖి గ్రోత్ కారిడార్ ఇండస్ట్రియల్ పార్కు కోసం రూ.250 కోట్లతో ప్రతిపాదనలు చేసిందని, రుషిల్ డెక్కర్స్ సంస్థ రూ.200 కోట్లతో వినీర్స్, పార్టికల్ బోర్డు పరిశ్రమను, ఎలైట్ లాజిక్స్ ఎగ్జిమ్ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.165 కోట్లతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని కలెక్టర్ వివరించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమై వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. పరిశ్రమలు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు సుధాసాగర్, రామ్మోహన్‌రావు, జిల్లా పరిశ్రమలు శాఖ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.