Drinking Water? పరిశ్రమ వ్యర్థాలా.. తాగునీరా ?
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:09 AM
Industrial Waste or Drinking Water? కిడ్నీ సమస్యకు కారణం.. పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలా లేక తాగునీరా? అన్నది తెలుకుకునేందుకే చిలకాం వచ్చామని విశాఖ జోనల్ సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ టి.సుదర్శనమ్ తెలిపారు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న రాతి గుట్టలు కూడా వ్యాధి ప్రబలడానికి కారణమా? అన్నది తేలాల్సి ఉందన్నారు.
సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సుదర్శనమ్
గరుగుబిల్లి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కిడ్నీ సమస్యకు కారణం.. పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలా లేక తాగునీరా? అన్నది తెలుకుకునేందుకే చిలకాం వచ్చామని విశాఖ జోనల్ సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ టి.సుదర్శనమ్ తెలిపారు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న రాతి గుట్టలు కూడా వ్యాధి ప్రబలడానికి కారణమా? అన్నది తేలాల్సి ఉందన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకే చిలకాం గ్రామంలో ప్రత్యేక పరిశీలన చేస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం చిలకాంలోని ఎస్సీ, బీసీ కాలనీతో పాటు పేపర్ ప్లేట్లు తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కిడ్నీ సమస్య కారణంగా మృతి చెందిన వారి వివరాలతో పాటు డయాలసిస్‌కు దూరంగా ఉండి వైద్య సేవలు పొందుతున్న వారి వివరాలను సేకరించారు. గ్రామంలో భూగర్భ జలాలు కాలుష్యంపై సమగ్ర విచారణ నిర్వహించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య, కార్యదర్శి శరవణ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామన్నారు. ‘చిలకాంలో తాగునీటి వనరుల శాంపిల్స్‌ను సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తాం. పర్యావరణ అనుమతులు లేకుండా పేపర్ ప్లేట్లు తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. పూర్తిస్థాయిలో అనుమతులు పొందే వరకు పరిశ్రమను మూసి వేయాలని ఆదేశించాం. చిలకాంలో కిడ్నీ సమస్య కారణంగా పదకొండు మంది మృతి చెందిన సంఘటన దృష్ట్యా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాం. కలుషిత నీటిని తాగిన కారణంగా ఇదంతా జరుగుతుందా లేదా, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై లోతుగా విచారణ చేపడతాం. భూగర్భ జలాల నాణ్యతను శాస్త్రీయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గ్రామంలో సోయల్, నీటి పరీక్షల నిర్వహణకు అవసరమైన శాంపిల్స్‌ను సేకరించాం. శాస్త్రీయ ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం గ్రామంలో ఉన్న బోరు నీటిని ఎవరూ వాడరాదు. శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించిన పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తాం.’ అని ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్టు వీరేంద్రకుమార్, ఈఈలు పి.శ్రీనివాసరావు, బి.కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.