జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:43 PM
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ తెలిపారు.
- రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్
రామభద్రపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ తెలిపారు. రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలోని కాకర్లవలస గ్రామంలో ఉన్న ఏపీఐఐసీ భూములను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ ప్రతిపాదిస్తున్న పరిశ్రమలపై ఆరాతీసి, ఎంఎస్‌ఎంఈకి కేటాయించిన భూముల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా భూముల వినియోగంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారి నుంచి ఏపీఐఐసీ భూములకు అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ పార్కు రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అదే విధంగా గుర్ల మండలంలో ప్రతిపాదిత సూపర్ స్మెల్టర్, డెంకాడ, భోగాపురం మండలాల్లో ఐటీ హబ్‌లకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ అంశాలను కూడా పరిశీలించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం పక్క జిల్లాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధవన్, అధికారులు పాల్గొన్నారు.