Indiscriminate Excavation తవ్వేస్తున్నారు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:14 PM
Indiscriminate Excavation మక్కువ మండలం డి.శిర్లాం గ్రామంలో గోముఖి , సువర్ణముఖి నదులు కలిసే చోట జోరుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రి, పగలని తేడా లేకుండా ఇక్కడి నుంచి పార్వతీపురం, బొబ్బిలి పట్టణాలకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు.
అక్కడి నుంచి నేరుగా అక్రమ రవాణా
మక్కువ రూరల్, మార్చి23(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం డి.శిర్లాం గ్రామంలో గోముఖి , సువర్ణముఖి నదులు కలిసే చోట జోరుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రి, పగలని తేడా లేకుండా ఇక్కడి నుంచి పార్వతీపురం, బొబ్బిలి పట్టణాలకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా ఇసుకాసురులు తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేస్తున్నా.. స్పందించే వారే కరువయ్యారు. రోజుకు 20 నుంచి 25 వరకు ట్రాక్టర్ల ద్వారా ఐదారు ట్రిప్పులతో ఇసుకను తరలిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం దాదాపు 40మంది కూలీలను వినియోగిస్తున్నారు. వారితో నదిలో తవ్వకాలు చేపట్టి.. ట్రాక్టర్లకు ఇసుకను లోడు చేయిస్తున్నారు. కాగా రోజూ తవ్వకాలు చేపడుతుండడం వల్ల నదుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇసుక ట్రాక్టర్ల రాకపోకల కారణంగా వెంకటభైరిపురం నుంచి శిర్లాం గ్రామానికి నదిగుండా వెళ్లే దారంతా పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా మారింది. వేసవిలో ఆ రెండు గ్రామాల ప్రజలు నదిదాటి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే నదిలో గోతులు ఏర్పడడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆయా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై మక్కువ తహసీల్దార్ కె.భరత్‌కుమార్‌ను వివరణ కోరగా..‘ డి.శిర్లాంలో ఉసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ’ అని తెలిపారు.