Independence celebrations soar high అంబరాన స్వాతంత్య్ర సంబరం
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:26 AM
Independence celebrations soar high
అంబరాన స్వాతంత్య్ర సంబరం
ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు
అబ్బురపరిచిన సాహస ప్రదర్శనలు
విజయనగరం కలెక్టరేట్/ టౌన్/ కంటోన్మెంట్, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి):
స్వాతంత్య్ర సంబరాలు అంబరాన్ని తాకాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం ఆద్యంతం స్ఫూర్తిమంతంగా సాగాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. దేశభక్తి గీతాలకు విద్యార్థులు లయబద్ధంగా చేసిన నృత్యాలు అందరినీ కట్టిపడేశాయి. రాజాం బాలభవన్ విద్యార్థులు సబ్‌సే బడే మేరా హిందూస్థానీ గీతానికి ప్రదర్శించిన నృత్యం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. పోలీస్ జాగిలాల విన్యాసాల్లో భాగంగా వాసన చూసి గంజాయిని పసిగట్టే ప్రక్రియ అందరినీ ఆలోచింపజేసింది. అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన అబ్బురపరిచింది. పోలీస్ డాగ్‌స్క్వాడ్స్ రుద్ర - ల వ్లీ సాహస విన్యాసాలు అబ్బో అనిపించాయి. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఎక్కువ మంది సందర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని చాటే శకటాలు ఒక్కోటిగా వస్తుంటే ప్రతి ఒక్కరూ పరిశీలనగా వీక్షించారు. సమగ్రశిక్షా అభియాన్ శకటం ప్రథమ బహుమతిని చేజెక్కించుకుంది. వేడుకల్లో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసాపత్రం, జ్ఞాపికను ప్రదానం చేశారు. 88 ప్రభుత్వ శాఖలకు చెందిన 521 మందికి వీటిని అందజేశారు.