Increase the Pension పింఛన్ పెంచండయ్యా!
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:27 AM
Increase the Pension, Please! జిల్లా పరిధిలో శతశాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పూర్తిస్థాయిలో పింఛన్ అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. తమ పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూ.. వినతులు ఇస్తున్నా.. ఫలితం ఉండడం లేదు.
ప్రతినెలా రూ.6 వేల పింఛన్‌కే పరిమితం
ఆ మొత్తం రూ.15 వేలకు పెంచాలని విన్నపం
గరుగుబిల్లి, ఏప్రిల్8(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో శతశాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పూర్తిస్థాయిలో పింఛన్ అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. తమ పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూ.. వినతులు ఇస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. జిల్లాలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారు 1,600 మందికి పైగా ఉన్నారు. వారికి ప్రతినెలా పింఛన్ రూపంలో రూ. 6 వేలు అందిస్తున్నారు. అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న 638 మందికీ దివ్యాంగ పింఛన్లు అందిస్తున్నారు. అయితే 100 శాతం వైకల్యం ఉన్నవారికి ప్రతినెలా రూ.15 వేలు అందించాలని నిర్ణయించినా.. జిల్లాలో కొంతమందికే ఆ మొత్తం అందుతుంది. జియ్యమ్మవలస మండలం సింగానపురం గ్రామానికి చెందిన రవికుమార్ మంచం నుంచి లేవలేని పరిస్థితి. శతశాతం దివ్యాంగుడైన ఆయనకు రూ.6 వేలు మాత్రమే పింఛను అందుతోంది. రూ. 15 వేలు పింఛన్ మంజూరు చేయాలని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందించినా ప్రయోజనం లేకపోయింది. అదేవిధంగా రావుపల్లి గ్రామానికి చెందిన ఓలగంటి సిద్ధు కూడా శతశాతం వైకల్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయనకు రూ. 6 వేలు పింఛన్ అందుతుంది. ప్రతి మండలంలో ఇలా ఎంతోమంది దివ్యాంగులు పూర్తిస్థాయి పింఛన్‌ను పొందలేకపోతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) సిబ్బందిని వివరణ కోరగా.. ‘శత శాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల సమస్యను జిల్లా వైద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి వైకల్య శాతం నిర్ధారణ అయిన తర్వాత పింఛన్ పెంపు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రస్తుతం గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికలు సిద్ధం చేస్తున్నాం.’ అని తెలిపారు.