Increase per capita income తలసరి ఆదాయం పెంచుతాం
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:59 PM
Increase per capita income జిల్లాలో రానున్న ఐదేళ్లల్లో రెట్టింపు స్థాయిలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి తెలిపారు. ఏటా జిల్లా 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తలసరి ఆదాయం పెంచుతాం
జిల్లాలో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి రేటు
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
ఆకట్టుకున్న సంస్కృతిక ప్రదర్శనలు
ఆలోచింపజేసిన స్టాళ్లు
ఉత్తమ అధికారులకు అవార్డులు
విజయనగరం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రానున్న ఐదేళ్లల్లో రెట్టింపు స్థాయిలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి తెలిపారు. ఏటా జిల్లా 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వ్యవసాయ రంగం ఆశాజనకంగా మారిందని, కొత్తగా 99 వేల 263 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చామన్నారు. అలాగే పాలు, కోడి మాంసం, గుడ్లు దిగుబడిలో ప్రగతి సాధిస్తున్నామని, నూతనంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామన్నారు. రవాణా రంగంలో తలమానికంగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, వృద్ధి రేటులో జిల్లా 78 శాతం స్కోరుతో ఏ గ్రేడ్ సాధించామన్నారు. జిల్లాలోని 242 గ్రామాల్లో 62 వేల ఎకరాల్లో 57 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ సురక్షితమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 84,898 రైతుల నుంచి 3.93 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారని తెలిపారు. వీటికి రూ.821 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. అదనంగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మత్స్యశాఖలో రానున్న ఐదు నెలల్లో 20 శాతం వృద్ధి రేటు సాధిస్తామని, జిల్లాలో పాడి అభివృద్ధితో పాటు కోళ్ల మాంసం, గుడ్లు ఉత్పత్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పరిశ్రమలతో ఉపాధి
జిల్లాలో 11 భారీ మెగా పరిశ్రమలను రూ.2,823 కోట్ల పెట్టుబడితో 10,029 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 23 మధ్య తరహా పరిశ్రమలను రూ.639 కోట్లతో ఏర్పాటు చేసి 7,861 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపించడానికి జిల్లాలో 217 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించామని, సుమారు రూ.45 కోట్ల నిధులతో ఎస్.కోట, గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు పనులు ప్రారంభించామన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని చెప్పారు. సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 4,592 కోట్ల రూపాయల అంచనాలతో తొలి దశ ఎయిర్‌పోర్టు పనులు పూర్తి చేశామన్నారు.
అందరికీ సురక్షిత జలం
జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి వేసి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని, ఈ పథకం ద్వారా రూ.1.96 లక్షల కుళాయిలు ఇచ్చామని, ఇప్పటి వరకూ 1,052 చోట్ల పనులు పూర్తి చేశామని తెలిపారు.
అందరికీ ఇళ్లు
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఉగాది నాటికి 12,366 గృహాలను ప్రవేశానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన 1.0 కింద జిల్లాకు 71,854 మంజూరు కాగా 49,615 గృహాలను పూర్తి చేసి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచామన్నారు. స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలో భాగంగా రానున్న ఐదేళ్లకు 1,36,000 వేల గృహాల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
రెవెన్యూలో రీ సర్వే
భూముల రీ సర్వే ద్వారా దశాబ్దాల కాలంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు పొందని రైతులకు రీ సర్వే చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకూ 3 విడతల్లో 111 గ్రామాల్లో రీ సర్వే పూర్తయి నాలుగో విడతలో 126 గ్రామాల్లో కొనసాగుతోందన్నారు. జిల్లాలోని 423 గ్రామాల్లో 2 లక్షల ఖాతాదారులకు పాస్‌పుస్తకాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్షా 89 వేల పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. సమిత్వ సర్వే ద్వారా 130 గ్రామాల్లో నివాసాలు, గ్రామ కంఠాల వివరాలను సర్వే చేశామని చెప్పారు.
శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాం
పోలీసుశాఖ ఆధ్వర్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి చెప్పారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న ఉద్ధేశంతో వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గంజాయి వినియోగించినా, విక్రయించినా, అక్రమంగా రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రహదారి భద్రతపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో సుపరిపాలన అందించేందుకు సహాయ, సహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి బబిత, ఎస్పీ దామోదర్, జెసీ సేతుమాధవన్, డీఆర్‌ఓ మురళీ, ఆర్‌డీఓ కీర్తి తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం చేపట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగాయి. కలెక్టర్, ఇతర ప్రముఖుల ప్రసంగాలు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాయి. విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచాయి. అలాగే వివిధ శాఖల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రథమ బహుమతిని డీఆర్‌డీఏ శకటం గెలుచుకుంది. స్టాళ్లు కూడా అందరిలో ఆసక్తి పెంచాయి. వాటిని ఎక్కువ మంది సందర్శించారు. ఐసీడీఎస్ స్టాల్‌కు ప్రథమ బహుమతి లభించింది. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ రామసుందర్ రెడ్డి జ్ఞాపికలు అందజేశారు. 83 శాఖలకు చెందిన 515 మంది అధికారులు, సిబ్బంది అవార్డులు అందుకున్నారు.