Increase in Support Price అటవీ ఉత్పత్తుల మద్దతు ధర పెంపు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:23 AM
Increase in Support Price for Forest Produce గిరిజనులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు ధరలు పెంచాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జీసీసీ ఇటీవల నూతన ధరల జాబితాను కార్యాలయాల వద్ద ప్రదర్శించింది.
ప్రభుత్వ ఆదేశాలతో మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న జీసీసీ
సీతంపేట రూరల్,జనవరి11(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు ధరలు పెంచాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జీసీసీ ఇటీవల నూతన ధరల జాబితాను కార్యాలయాల వద్ద ప్రదర్శించింది. ఈ మేరకు గతంలో పిక్కతో ఉన్న కేజీ చింతపండు ధర రూ.32.40 ఉండగా.. నేడు రూ.36కు కొనుగోలు చేస్తున్నారు. కేజీ నల్లజీడి పిక్కల ధర గతంలో రూ.18 ఉండగా .. ప్రస్తుతం రూ.35వరకు పెంచారు. కేజీ రూ.30 ఉన్న కుంకుడుకాయల ధరను రూ.35కు పెంచారు. కేజీ తానికాయల ధర రూ.15 నుంచి రూ.18 వరకు పెంచారు. ఎండు ఉసిరికిపప్పును గతంలో రూ.80కి కొనుగోలు చేయగా నేడు వాటి ధర రూ.90వరకు పెంచారు. కేజీ ముషిడిపిక్కల ధర గతంలో రూ.90ఉండగా నేడు రూ.100వరకు కొనుగోలు చేస్తున్నారు. కాగుపప్పు, విప్పపప్పు, చింతపిక్కలు, కరక్కాయలు తదితర అటవీ ఉత్పత్తుల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.
- ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులకు అధికలాభాన్ని చేకూర్చే పంటల్లో ప్రధానమైనది కొండచీపుర్లు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సుమారు 3వేల ఎకరాల్లో గిరిజన రైతులు వాటిని సాగుచేస్తున్నారు. అయితే దీని ధరను మాత్రం జీసీసీ పెంచలేదు. దీనిపై గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.
- ఇదిలా ఉండగా గిరిజన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నూతన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఐటీడీఏ కేంద్రంగా కొండచీపుర్లకు అడ్వాన్స్ టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా నెలకు 50వేల కొండచీపుర్లను గిరిజన రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి వాటిని విక్రయించేందుకు చర్యలు చేపడుతోంది. ఈనెల 9న ఐటీడీఏలో అడ్వాన్స్ టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. ఐదు నెలల పాటు నెలకు 50వేల కొండచీపుర్లను గ్రేడ్ 1రకం రూ.45, గ్రేడ్ 2రకం రూ.35, గ్రేడ్ 3రకం రూ.30 చొప్పున గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేశారు. దీనిపై సీతంపేట జీసీసీ బీఎం కృష్ణారావును వివరణ కోరగా.. ‘ఇటీవల కాలంలో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచాం. కొండచీపుర్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉంది. గిరిజన రైతులకు ఇబ్బందులు కలగకుండా అడ్వాన్స్ టెండర్‌లు నిర్వహించాం. కొండచీపుర్లను గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ’ అని తెలిపారు.