Share News

పీవీటీజీ గృహాలకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:18 AM

గిరిజన ప్రాంతాల్లో జీవిస్తున్న నిరుపేద ఆదివాసీల (పర్టిక్యూలర్లి వలనరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌) సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం 2023-24లో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం-జన్‌మన్‌)పథకాన్ని రూపొందించింది.

 పీవీటీజీ గృహాలకు ప్రోత్సాహం
లంబగూడలో శ్లాబులెవెల్‌లో ఉన్న గృహాలు

- ప్రభుత్వ చొరవతో పూర్తికానున్న పనులు

- నిర్మాణ సామాగ్రి పంపిణీకి చర్యలు

- హర్షం వ్యక్తంచేస్తున్న గిరిపుత్రులు

సీతంపేట రూరల్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో జీవిస్తున్న నిరుపేద ఆదివాసీల (పర్టిక్యూలర్లి వలనరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌) సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం 2023-24లో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం-జన్‌మన్‌)పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద పీవీటీజీ లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి యూనిట్‌ ధర రూ.2.39లక్షలుగా నిర్ణయించింది. పునాది (బేస్‌మెంట్‌ లెవెల్‌)కి రూ.70వేలు, శ్లాబుఎత్తు (రూఫ్‌లెవెల్‌)కు రూ.90వేలు, శ్లాబుకు రూ.40వేలతో పాటు ఉపాధిహామీ పథకం కింద రోజువారి కూలి (మ్యాన్‌డేస్‌)రూ.27వేలు, బాత్‌రూం బిల్లు రూ.12వేలను విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తోంది. సకాలంలో నిధులు చెల్లిస్తుండడంతో జిల్లాలో పీవీటీజీలు నివసిస్తున్న 13 మండలాల్లో గృహ నిర్మాణాలు కొంతవరకు వేగవంతం అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న యూనిట్‌ ధర రూ.2.39లక్షలకు మరో రూ.లక్ష అందజేసి పీవీటీజిలకు అండగా నిలుస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈఏడాది ఫిబ్రవరిలో ఒక ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. దీనిలో భాగంగా గిరిపుత్రులకు గృహ నిర్మాణ సామాగ్రిని అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఒక్కొక్కరికి 487 కేజీల ఐరన్‌ బార్‌ రాడ్స్‌ (8,10ఎంఎం), 10 ఎలక్ట్రికల్‌ ప్లాస్టిక్‌ పైపులు, ఎలక్ట్రికల్‌ వైర్‌, స్విచ్‌బోర్డులు, బల్బు వాలర్స్‌ వంటివి పంపిణీ చేసేందుకు హౌసింగ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మెటీరియల్స్‌ ఇప్పటికే ఆయా మండలాల హౌసింగ్‌శాఖ గోడౌన్లకు చేరాయి.

జిల్లాలో పరిస్థితి..

పీఎం జన్‌మన్‌ పథకం కింద బలిజిపేట మండలానికి 2 ఇళ్లు, మక్కువ 29, కొమరాడ 11, సాలూరు 84, పాలకొండ 38, జియ్యమ్మవలస 204, గుమ్మలక్ష్మీపురం 555, పార్వతీపురం 15, భామిని 285, పాచిపెంట 46, కురుపాం 2004, వీరఘట్టం 147, సీతంపేట 1749.. మొత్తంగా 5,169 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 231 గృహ లబ్ధిదారులను అనర్హులుగా (ఇన్‌ఎలిజిబుల్‌) అధికారులు గుర్తించారు. మిగిలిన 4,938 గృహాలకు గాను ఇంతవరకు పనులు ప్రారంభంకానివి 576వరకు ఉన్నాయి. గ్రౌండింగ్‌ అయి వివిధ దశల్లో ఉన్నవి 4,362 (84.39శాతం), నిర్మాణాలు పూర్తయినవి 1303 (25.21శాతం) వరకు ఉన్నాయి. ప్రగతి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం అందించనున్న గృహనిర్మాణ సామాగ్రితో నిర్మాణాలు వేగవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పనులు ప్రారంభిస్తాం:

పీఎం జన్‌మన్‌ పథకం కింద నా పేరున ఇల్లు మంజూరైంది. శ్లాబు వరకు పూర్తి చేశాం. ప్లాస్టింగ్‌, వైరింగ్‌, టైల్స్‌ వంటి పనులు పూర్తిచేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఐరన్‌, ఎలక్ట్రికల్‌ సామాన్లను వినియో గించి ఇళ్లు పూర్తిచేసి గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

-సవర తవిటమ్మ, మేడవొబ్బంగి, సీతంపేట

నిధులు రావాల్సి ఉంది

పీఎం జన్‌మన్‌ పథకం కింద గృహ నిర్మాణాలు ప్రారంభించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద రూ.లక్ష ప్రకటించింది. ఈ నిధులు ఇంకా రావాల్సి ఉంది. పీవీటీజీ లబ్ధిదారులకు ఐరన్‌, ఎలక్ట్రికల్‌ పైపులు, స్విచ్‌బోర్డులు, స్విచ్‌లు అందిస్తాం.

-జి.రవి, హౌసింగ్‌ ఈఈ, పాలకొండ డివిజన్‌

Updated Date - Jun 12 , 2026 | 12:18 AM