Share News

Inadequate training అరకొరగా శిక్షణ

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:23 PM

Inadequate training జిల్లాలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ) విద్యార్థులు నిరాశతో ఉంటున్నారు. భవిష్యత్‌పై వారిలో అయోమయం నెలకుంటోంది. ఐటీఐలు గాడి తప్పడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. శిక్షణ సరిగా ఉండడం లేదు. అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేవు. సిబ్బంది కూడా అంతంతే. వెరసి ఎన్నో ఆశలతో ఐటీఐలో ప్రవేశించిన విద్యార్థులు నేడు పునరాలోచనలో పడుతున్నారు.

Inadequate training అరకొరగా శిక్షణ
విజయనగరంలో ప్రభుత్వ ఐటీఐ కళశాల

అరకొరగా శిక్షణ

ఉపాధి కానరాని భరోసా

ఉద్యోగ డ్రైవ్‌ నిర్వహణకు తిలోదకాలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

ఐటీఐల తీరుపై నిరాశ చెందుతున్న విద్యార్థులు

దాసన్నపేట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ) విద్యార్థులు నిరాశతో ఉంటున్నారు. భవిష్యత్‌పై వారిలో అయోమయం నెలకుంటోంది. ఐటీఐలు గాడి తప్పడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. శిక్షణ సరిగా ఉండడం లేదు. అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేవు. సిబ్బంది కూడా అంతంతే. వెరసి ఎన్నో ఆశలతో ఐటీఐలో ప్రవేశించిన విద్యార్థులు నేడు పునరాలోచనలో పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏటా ఆరు వేల మంది వరకూ ఐటీఐలో చేరుతున్నారు. అదే స్థాయిలో రిలీవ్‌ అవుతున్నారు. ఎలక్ర్టానిక్‌, వెల్డర్‌, ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, సివిల్‌ డ్రాఫ్ట్‌మెన్‌ వంటి కోర్సులు ఉన్నాయి. కానీ ఎన్ని క్యాంపస్‌ డ్రైవ్‌లు జరుగుతున్నాయి? ఎంతమందికి ఉపాధి దొరికింది? ఎందరు ఉద్యోగాలు పొందుతున్నారు? అంటే మాత్రం సమాధానం దొరకదు. ప్రభుత్వ ఐటీఐల్లో వసతులు లేకపోవడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ఈ ఏడాది చేరేందుకు కూడా విద్యార్థులు విముఖత చూపుతున్నారు. ఐటీఐ మిగులు సీట్ల కోసం విడతల వారీగా కౌన్సెలింగ్‌లు చేపడుతున్నా సీట్లు భర్తీ కావడం లేదు.

శాశ్వత నియామకాలు లేక..

ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. విజయనగరం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాంలో నడుస్తున్నాయి. కానీ ఎక్కడికక్కడే సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా పాత భవనాల్లోనే విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. శిక్షణ ఇచ్చేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. కొన్నాళ్లుగా శాశ్వత నియామకాలు అంటూ లేవు. కాంట్రాక్ట్‌ సిబ్బందే శిక్షణనిస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 14 యూనిట్లకుగాను శిక్షణ ఇచ్చే సిబ్బంది ఇద్దరు మాత్రమే. వీరిలో ఒకరే రెగ్యులర్‌, మరొకరు కాంట్రాక్ట్‌ ఉద్యోగి. ఈ ఐటీఐలో వందలాది మంది విద్యార్థులున్నారు. కానీ వారికి ట్రేడ్‌కు తగ్గట్టు శిక్షణనిచ్చేవారు లేరు. ఈ ఐటీఐకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ గుర్తింపు దక్కింది. అయినా శిక్షకుల పోస్టులను మంజూరు చేయడం లేదు. బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో నలుగురు రెగ్యులర్‌, ముగ్గురు కాంట్రాక్ట్‌ శిక్షకులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 24 యూనిట్లలో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. సిబ్బంది కొరత ఒక వైపు, ఇరుకు గదుల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ పరిస్థితుల వల్లే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు ఐటీఐల వైపు మొగ్గుచూపుతున్నారు. సిబ్బందిపరంగా రాజాం, సాలూరులో ఫర్వాలేదు. ఇక్కడ ఐటీఐల ఏర్పాటుతోనే శిక్షకులను నియమించారు. మిగతా అంశాల్లో వెనుకబాటు ఉంది.

ఆదరణ ఉన్నా..

ఐటీఐ అంటే విపరీతమైన డిమాండ్‌ ఉండేది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఐటీఐలను తీర్చిదిద్దలేకపోతున్నారు. పదో తరగతి తరువాత ఎక్కువ మంది ఐటీఐ విద్యవైపు చూస్తున్నారు. దీనికి కారణం రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వపరంగా విద్యుత్‌, పంచాయతీరాజ్‌ వంటి శాఖల్లో ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు లభిస్తుండడమే. 2019లో సచివాలయాల విద్యుత్‌ లైన్‌మెన్లు, సర్వేయర్‌ పోస్టులు వేలాదిగా భర్తీ అయ్యాయి. ఆ సమయంలో ఐటీఐ ఎలక్ర్టానిక్‌, సివిల్‌ డ్రాఫ్ట్‌మెన్‌ కోర్సులు చేసిన వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి. దీంతో అప్పటి నుంచి ఐటీఐకి మరింత డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వ ఐటీఐలను మరింతగా బలోపేతం చేసి .. ఉద్యోగ మేళాలు, పేరుమోసిన కంపెనీలను తెచ్చి డ్రైవ్‌లు నిర్వహిస్తే ఏటా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

బలోపేతానికి చర్యలు

జిల్లాలో ఐటీఐల బలోపేతానికి అన్నిచర్యలు చేపడుతున్నాం. వసతితో పాటు సిబ్బంది కొరత విషయంపై ప్రభుత్వానికి నివేదించాం. ఉన్నంతలో మంచిగానే శిక్షణ అందిస్తున్నాం. జిల్లాకు ఉద్యోగ మేళాలను రప్పించేలా చూస్తున్నాం.

- టీవీ గిరి, జిల్లా ప్రభుత్వ ఐటీఐల కన్వీనర్‌, విజయనగరం

Updated Date - Sep 16 , 2026 | 11:23 PM