Share News

In the Grip of Fear… భయం గుప్పిట్లో ..

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:25 AM

In the Grip of Fear… జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. స్లాబ్‌ పెచ్చులూడి పడుతున్నాయి. ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. గోడలు బీటలు వారగా.. ప్రహరీలు కూలి ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల శిథిల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్నిచోట్ల అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే పాఠాలు బోధిస్తున్నారు.

In the Grip of Fear… భయం గుప్పిట్లో ..
గుమ్మలక్ష్మీపురం: కూలిన పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రహరీ స్థానంలో చీరలు కట్టిన దృశ్యం

  • ప్రమాదకరంగా స్లాబ్‌లు, గోడలు.. దెబ్బతిన్న ప్రహరీలు

  • కొన్నిచోట్ల పాత భవనాలు తొలగించని వైనం

  • విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని ఇక్కట్లు

జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. స్లాబ్‌ పెచ్చులూడి పడుతున్నాయి. ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. గోడలు బీటలు వారగా.. ప్రహరీలు కూలి ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల శిథిల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్నిచోట్ల అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే పాఠాలు బోధిస్తున్నారు. ఇక వర్షం కురిస్తే అంతే సంగతి. కొన్నిచోట్ల గొడుగులు వేసుకుని పాఠాలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వసతి సమస్య కూడా వేధిస్తోంది. మొత్తంగా విద్యార్థులు భయం గుప్పెట్లో చదువులు సాగించాల్సి వస్తోంది. ఇటీవల సాలూరులో పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థి మృత్యువాత పడగా.. అనంతపురం జిల్లాలో కూడా హాస్టల్‌ గోడ కూలి ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. శిథిల భవనాలు, ప్రహరీలు, గోడలు తొలగించి కొత్తవి నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 1702 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో రెండు పాఠశాలల్లో పిల్లలు లేరు. ప్రస్తుతం 1700 బడులు పనిచేస్తుండగా.. వాటిల్లో 1.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా జిల్లాలో 16 బడులకు సంబంధించి రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి. మిగిలిన పాఠశాలల్లో 172 తరగతి గదులు, 20 వంట గదులు, 29 మరుగుదొడ్లు కూలే స్థితిలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనిపై డీఈవో బ్రహ్మాజీరావును వివరణ కోరగా.. ‘శిథిలావస్థలో ఉన్న రక్షణ గోడలు, తరగతి గదులు తదితర వాటి వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాధికారులకు తెలియజేశాం. నిధులు మంజూరైనవెంటనే నిర్మాణాలు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

కూలే స్థితిలో తరగతి గది..

వీరఘట్టం: దశుమంతుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ తరగతి గది శిథిలావస్థకు చేరింది. దీంతో మరో తరగతి గదికి విద్యార్థులను తరలించి పాఠాలు బోధిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజనం, విరామం సమయాల్లో విద్యార్థులు ఆ గదిలోకి వెళ్తున్నారు. విద్యార్థులు ఈ గదిలోకి వెళ్లకుండా ఒక్కోసారి ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నా.. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. తక్షణమే శిథిలావస్థ గదిని తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

శిథిల భవనం.. కూలిన ప్రహరీ

భామిని: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో ప్రహరీ శిథిలావస్థకు చేరింది. ఆరేళ్ల కిందట ఉత్తరవైపు గోడ కొంతమేర కూలిపోయింది. వర్షాలు, గాలులకు సగానికి పైగా నేలమట్టమైంది. మిగిలిన గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే బూర్జి ప్రాథమిక పాఠశాల భవనం బీటలు వారింది. వర్షం కురిస్తే గదుల్లో నీరు కారుతుంది. దీంతో బిక్కుబిక్కమంటూ ఇరుకు గదుల్లోనే 66 మంది విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది.

బిక్కుబిక్కుమంటూ..

పార్వతీపురం టౌన్‌: పట్టణంలోని కట్టాసరస్వతమ్మ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 50 ఏళ్ల కిందట నిర్మించిన తరగతి గదుల్లో బిక్కు బిక్కుమంటూ విద్యార్థులు చదువు కోవాల్సి వస్తోంది. గతంలో తూతూ మంత్రంగానే తరగతి గదులకు మరమ్మతులు చేపట్టారు. దీనిపై హెచ్‌ఎం శ్రీదేవిని వివరణ కోరగా శిఽథిలావస్థకు చేరుకున్న రెండు తరగతి గదుల్లో ఒక్క గదిలో 5వ తరగతి విద్యార్ధులకు బోఽధిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులకు తెలియజే శామన్నారు.

గిరిజన చిన్నారులకు తప్పని అవస్థలు

సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో వాబ గిరిజన ప్రాథమిక పాఠశాల కూలే స్థితిలో ఉంది. భవనం స్లాబ్‌ పెచ్చులూడిపోతుండడంతో ఇక్కడున్న 12 మంది విద్యార్థులకు రక్షణ కొరవడింది. వర్షకాలం వచ్చిందంటే చిన్నారులను పాఠశాలకు పంపించాలంటే భయం వేస్తోందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రమాదం అంచున..

కురుపాం రూరల్‌: భల్లుకోట గ్రామంలో ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులూడిపోతుండగా.. గోడలు బీటలు వారాయి. వరండా కుంగిపోయింది. మరుగుదొడ్లు కూడా శిఽథిలమయ్యాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. కాగా ఇక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు 22 మంది విద్యార్థులుండగా.. మధ్యాహ్న భోజనాన్ని వేరొకరి ఇంట్లో వండి వారికి పెడుతున్నారు. భారీ ప్రమాదం సంభవించి ప్రాణనష్టం సంభవించకముందే నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కొబ్బరి కొమ్మలే స్లాబ్‌

పార్వతీపురం రూరల్‌: పెద్దమరికి పంచాయతీ పరిధి కొత్తూరు పాఠశాలకు పూర్తిస్థాయి భవనం లేదు. గతంలో ఎప్పుడో నిర్మించిన తరగతి గదికి నేటికీ స్లాబ్‌ వేయలేదు. దీంతో గోడల మధ్య కర్రలు, కొబ్బరి కొమ్మలు వేసుకుని.. తరగతి గది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఒక్క తరగతి గది సరిపోకపోవడంతో గ్రామస్థులు చందాలేసుకుని పూరిపాక వేసి.. అదనపు తరగతి గదిని ఏర్పాటు చేశారు.

చీరలే ప్రహరీగా..

గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కురిసిన వర్షాలకు పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో సమీపంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కూలిన ప్రహరీ స్థానంలో చీరలు కట్టి వదిలేశారు. దీంతో విద్యార్థినలకు రక్షణ కొరవడింది.

అసంపూర్తి భవనం..

పాచిపెంట రూరల్‌: అసంపూర్తిగా ఉన్న భవనంలోనే గుమ్మడిగుడ్డివలస జీపీ స్కూల్‌ కొనసాగుతుంది. ఎనిమిదేళ్ల కిందట సర్వశిక్షా అభియాన్‌ నిధులు రూ.5.40 లక్షలతో ఈ పాఠశాల భవనం పనులు చేపట్టారు. అయితే శ్లాబ్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత పనులు నిలిచిపోయాయి. తలుపులు, కిటికీలు లేకపోవడంతో పాటు గచ్చులు కూడా వేయలేదు. దీంతో ఇక్కడ చదువుతున్న ఏడుగురు విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రహరీకి ఏర్పాటు చేసిన ఇనుప గేటును తీగలతో వేలాడదీయడంతో ప్రమాదకరంగా మారింది.

గొడుగుల నీడలో..

జియ్యమ్మవలస: బొడ్డవలస గ్రామంలో గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 1988లో నిర్మించిన పాఠశాల భవనం పరిస్థితి దయనీయంగా మారింది. స్లాబు పెచ్చులూడి పోతుండగా.. గోడలు బీటలు వారాయి. వర్షం కురిస్తే.. స్లాబ్‌ నుంచి నీరు కారుతుంది. ఈ సమయంలో విద్యార్థులు గొడుగులు పట్టి పాఠశాల గదిలో చదవు కోవాల్సి వస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేసినా.. ఎటువంటి స్పందన లేదని ఏకోపాధ్యాయుడు భాస్కరరాయుడు తెలిపారు.

వసతి పొందలేక..

పాలకొండ: డివిజన్‌ కేంద్రంలోని బీసీ బాలురు పోస్టుమెట్రిక్‌ వసతిగృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనంలోని గదుల్లో స్లాబు పెచ్చులూడిపోతుండగా.. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. బాత్‌రూమ్‌లు, టాయిలెట్లుకు రన్నింగ్‌ వాటర్‌ లేదు. దీంతో ఈ ఏడాది అకడమిక్‌ సంవత్సరంలో సుమారు 25 మంది విద్యార్థులు వసతి పొందలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వారంతా బయటే ఉన్నారు. వసతిగృహంలో ఉండడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేటు భవనం కోసం వెతుకుతున్నారు.

చిన్న గదిలోనే తరగతులు

సాలూరు: మండలంలో గంగన్న దొరవలసలో ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం లేదు. దీంతో ఓ చిన్న గదిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 21 మంది విద్యార్థులు ఉండగా.. వారికి ఆ చిన్న గది సరిపోవడం లేదు. దీంతో గ్రామంలోని వేరే చోట ఓ గదిని అద్దెకు తీసుకుని పది మంది విద్యార్థులకు బోధిస్తున్నారు. పునాది దశలోనే నిలిచిపోయిన గంగన్న దొరవలస గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పరాయి పంచన..

గరుగుబిల్లి: సీమలవానివలసలో ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో గ్రామస్థులు చిన్నపాటి గదిని సమకూర్చారు. ప్రస్తుతం అందులోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. గతంలో 17 మంది విద్యార్థులు (గిరిజన) ఇక్కడ ఉండగా.. పాఠశాల భవనం నిర్మాణానికి అధికారులు చొరవ చూపకపోవడంతో ప్రస్తుతం వారి సంఖ్య 8కి చేరింది.

Updated Date - Aug 27 , 2026 | 12:25 AM