Share News

రెప్పపాటులో ఘోరం

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:36 PM

అతివేగం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకుంది.

రెప్పపాటులో ఘోరం
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ దామోదర్‌

- కారు ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు మృతి

- అదే కారు లారీని ఢీకొన్న వైనం

- డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి మృతి

- పూసపాటిరేగ మండలం పేరపురం వద్ద ఘటన

- అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ

విజయనగరం/దాసన్నపేట, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అతివేగం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరపురం గ్రామం జాతీయ రహదారి-16పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీ శారదనగర్‌కు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ కరుణాకరం శ్రీనివాస్‌(59), పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగిపేట మాజీ సర్పంచ్‌ కళ్యంపూడి సింహాచలం(48)తో మరోవ్యక్తి కారులో సోమవారం ఉదయం పనిపై శ్రీకాకుళం వెళ్లారు. పని పూర్తవడంతో మరుసటి రోజు తిరిగి కారులో విశాఖకు బయలుదేరారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారుపై అతివేగంగా వస్తూ అదే సమయంలో పేరాపురం వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్‌ బంక్‌ సమీపంలో టీ తాగి రోడ్డు పక్కన మాట్లాడుతున్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చినసాన పంచాయతీ గంగుపేట గ్రామానికి చెందిన సదునుపల్లి రమేష్‌ (25), సదునుపల్లి రాము (30) అనే అన్నదమ్ములను ఢీకొన్నారు. దీంతో వారి శరీరాలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. అక్కడికక్కడే వారు మృతి చెందగా, మృతదేహాలు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయాయి. అయితే, కారు అంతే వేగంతో రోడ్డుపక్కన ఆగిఉన్న కంటైనర్‌ లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రీనివాస్‌ అక్కడకక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న సింహాచలం తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను పోలీసులు, స్థానికులు విజయనగరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ దామెదర్‌ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లారీ కింద ఇర్కుపోయిన కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీయించారు. మృతదేహాలను విజయనగరం పెద్దాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్‌ మణికుమార్‌, ఎంవీఐలు దుర్గాప్రసాద్‌, రవిశంకర్‌, వెంకటరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో ఉన్న స్పీడో మీటరును పరిశీలించి అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారనకు వచ్చారు. లారీ వెనుక టైర్లు బెండు కావడంతో ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని గుర్తించారు. కారుకు సంబంధించిన ఫిట్‌నెస్‌, ఇతర పత్రాలు, డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉందా? లేదని పరిశీలిస్తామని డీటీసీ మణికుమార్‌ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

28vzp50.gif

రమేష్‌(ఫైల్‌), రాము(ఫైల్‌), సింహాచలం(ఫైల్‌)

మా పరిస్థితి ఏంటీ దేవుడా?

రమేష్‌కు భార్య నీలవేణి, 11 నెలల బాబు, రాముకు భార్య కస్తూరితో పాటు 10, 8 సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాత్రికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలియడంతో కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోదిస్తున్నారు. నాన్న ఎప్పటికీ రాడని తెలుసుకున్న రాము పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భర్తలు తెచ్చేకూలితో కుటుంబం గడిచేదని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటీ దేవుడా అంటూ మృతుల భార్యలు విలపిస్తున్నారు.

భయానకం..

రాత్రి సమయం కావడంతో రోడ్డుపక్కనే ఉన్న ఓ హోటల్‌లో తినేందుకు వెళ్లాను. ఇంతలోనే భారీ శబ్దం రావటంతో ఏం జరిగిందని బయటకు వచ్చాను. అప్పటికే రెండు మృతదేహాలు రక్తం కారుతూ చెల్లచెదురుగా పడిఉన్నాయి. కారులో డ్రైవర్‌ సీటులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పక్కసీట్లో ఉన్నవ్యక్తి తల పగిలి ఉన్నాడు. అప్పటికే ఆయన మృతి చెందడంతో భయందోళనకు గురయ్యాను.

-రెల్లి బలరాం, ప్రత్యక్ష సాక్షి, స్థానికుడు

Updated Date - Apr 28 , 2026 | 11:36 PM