అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:58 PM
అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోకి మరో జిల్లా చేరింది. ప్రభుత్వం కొత్తగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసింది.
నాలుగు జిల్లాలు
- కొత్తగా చేరిన పోలవరం
-ఆరు రెవెన్యూ డివిజన్లు, ఐదు ఐటీడీఏలు కూడా..
పార్వతీపురం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోకి మరో జిల్లా చేరింది. ప్రభుత్వం కొత్తగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పటికే ఉన్న మూడు జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన జిల్లాను కలిపి మొత్తం నాలుగు జిల్లాలు అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి. ఆరు రెవెన్యూ డివిజన్లు, ఐదు ఐటీడీఏలు కూడా ఇందులోనే ఉన్నాయి. దేశంలోనే రెండో అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా అరకు గుర్తింపు పొందింది. దీని పరిధిలో పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోకవర్గాలు ఉన్నాయి. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం విజయనగరం జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండడంతో ఈ జిల్లా కూడా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ భాగమైనట్లు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలతో పాటు కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఉండడంతో ఈ జిల్లా కూడా అరకు పార్లమెంట్ పరిధిలోకి వచ్చినట్లయింది. ఈ విధంగా నాలుగు జిల్లాల పరిధిలో అరకు పార్లమెంట్ స్థానం ఉంది. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాలు, విజయనగరం జిల్లాలోని ఒక మండలం(మెంటాడ), అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లాలోని 12 మండలాలు మొత్తం కలిపి 39 మండలాలు అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. అలాగే, రంపచోడవరం, చింతూరు, పార్వతీపురం, పాలకొండ, బొబ్బిలి (మెంటాడ), పాడేరు రెవెన్యూ డివిజన్లతో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటీడీఏలు కూడా అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.