Goats… మేకల మేత కోసమని..
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:18 AM
In Search of Fodder for the Goats… తాను పెంచుకుంటున్న మేకల ఆహారం కోసమని చెట్టు ఎక్కిన గిరిజనుడు.. కాలుజారి కింద పడి మృతి చెందాడు. దీంతో ఈ గిరిజన కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోయింది. ఈ విషాదకర ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది.
ఆరునెలల కిందట అనారోగ్యంతో పెద్ద కుమారుడు మృతి
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
సీతంపేట,అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తాను పెంచుకుంటున్న మేకల ఆహారం కోసమని చెట్టు ఎక్కిన గిరిజనుడు.. కాలుజారి కింద పడి మృతి చెందాడు. దీంతో ఈ గిరిజన కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోయింది. ఈ విషాదకర ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం.. అంటికొండ పెద్దగూడ గ్రామానికి చెందిన సవర ఫాల్గుణరావు(40) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. తాను కొన్నాళ్లుగా నాలుగు మేకలను పెంచుకుంటున్నాడు. వాటికి ఆహారం కోసమని బుధవారం తన భార్య మీనాకుమారితో కలిసి గ్రామ సమీపంలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లాడు. చెట్టు ఎక్కి.. ఆకులు కోస్తున్నాడు. అయితే తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి చెట్టు భాగం తడిగా ఉంది. దీంతో కాలుజారి ఒక్కసారిగా చెట్టుపై నుంచి కిందపడ్డాడు. కింద ఉన్న భార్య షాక్‌కు గురై గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన ఫాల్గుణరావును ఇంటి వరకు మోసుకొచ్చారు. ఆ తర్వాత సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంటివద్దే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఆరునెలల కిందటే ఫాల్గుణరావు పెద్దకుమారుడు సవర మహేష్ అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు ఇంటి పెద్ద ఫాల్గుణరావు మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని భార్య ఆశావర్కర్‌గా పనిచేస్తుండగా, కుమార్తె జానకి సామరెల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నతపాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. రెండో కుమారుడు హేమవర్ధన్ గ్రామంలోని పాఠశాలలో చదువుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి తమకు సమాచారం లేదని ఎస్‌ఐ వై.అమ్మన్నరావు తెలిపారు.